
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో రోజుకు 12 మంది రైతులపై దాడులు జరుగుతున్నాయని, జాతీయ నేర గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను అంటరానివారిగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరులో ఆత్మహత్య చేసుకున్న దళిత ఉద్యోగి రవికుమార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని వెల్లడించారు. అతడి ఆత్మహత్యకు కారణమైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రవి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా చార్జిషీట్లు దాఖలు చేయడం లేదన్నారు. చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.