సీఎంగా మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలి! | Sakshi
Sakshi News home page

సీఎంగా మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలి!

Published Wed, Feb 21 2018 4:36 PM

APCC fire on chandrababu for special status issue - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట మారుస్తారని, ఆయన మాటలు మారుస్తున్న తీరును గమనిస్తే సీఎం మానసిక స్థితిమీద అనుమానం కలుగుతోందని ఏపీసీసీ నేతలు మండిపడ్డారు. హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పలు సందర్భాల్లో చంద్రబాబు తడవకొక మాట మాట్లాడారని, నిన్న (మంగళవారం) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో  చంద్రబాబు మాటలు లీకుల రూపంలో మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లీకుల రూపంలో మీడియాకు లీకులిస్తూ సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా మారారని అర్థమవుతోందని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం స్థానంలో టీడీపీ మరొకరికి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం సొంతజిల్లా చిత్తూరులో చంద్రబాబుకు అబద్ధాల నాయుడిగా నిక్ నేమ్ ఉండగా, ఇప్పుడు లీకుల నాయుడిగా మరోపేరు జత చేరిందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, అది ఏపీ హక్కు అని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధమైన హామీలను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్

వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని మరో నేతకు చంద్రబాబు అవకాశం ఇవ్వాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్‌లో ఎంపీ మల్లికార్జున ఖర్గే రూల్ 184 కింద నోటీసు ఇచ్చారని, టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నేతలు లోక్‌సభలో చర్చలో పాల్గొనాలని సూచించారు.

మార్చి 6, 7, 8 తేదీల్లో ఛలో పార్లమెంట్ పేరిట అంతిమ పోరాటానికి పిలుపునిస్తూ ఏపీపీసీ ఉద్యమ కార్యాచరణ ఢిల్లీలో చేపట్టనున్నామని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రావాల్సిందిగా కోరుతూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి లేఖలు రాయనున్నట్లు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు వెల్లడించారు.

Advertisement
Advertisement