పార్టీ చరిత్రలో ఇదే ఘోర పరాభవం..!

AP Election Results TDP Gets A Massive Failure - Sakshi

ఇంత దారుణ ఓటమా!

టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం 

భవిష్యత్తుపై భయాందోళనలు

సాక్షి, అమరావతి: ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చూడనంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. తమ ఊహకు అందని రీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి గెలుపు అవకాశాలున్నాయని భావించినా పైకి మేకపోతు గాంభీర్యం నటించిన నేతలు ఫలితాల తీరు చూసి అవాక్కయ్యారు. ఒక్క నాయకుడికీ నోట మాట రాని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది.

150 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలవడమంటే ఆషామాషీ విషయం కాదని, క్షేత్రస్థాయిలో జగన్‌ పట్ల ఆ స్థాయి సానుకూలత ఉన్న విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ అధినేత గుర్తించలేకపోయారనే అసహనం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయి వాస్తవాలను పట్టించుకోకుండా కొందరు అధికారుల చెప్పు చేతల్లో ఉంటూ అంతా తనకు తెలుసున్న రీతిలో ఐదేళ్లు పాలన సాగించిన తమ అధినేత ప్రజల నాడి పట్టుకోలేకపోయారని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు చెప్పే కాకి లెక్కలు నమ్మి ప్రజల్లో ప్రభుత్వం పట్ల 70 శాతం సంతృప్తి ఉందనుకోవడం వల్లే ఇంత దారుణ ఓటమిని మూటగట్టుకోవాల్సివచ్చిందని వాపోతున్నారు.  

వ్యూహాలన్నీ తల్లకిందులు 
ఎన్నికల్లో తమ అధినేత అనుసరించిన వ్యూహాలన్నీ తల్లకిందులయ్యాయనే అభిప్రాయాన్ని పార్టీ సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యర్థి అయితే కేసీఆర్‌ను తిట్టడం ద్వారా ఆంధ్రా సెంటిమెంటును రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలు వికటించాయని, మోదీని తిట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం బెడిసికొట్టిందని వాపోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో రహస్య మిత్రుత్వం, కేఏ పాల్‌ వంటి వారిని రంగంలోకి దించి లబ్ధి పొందాలనుకోవడం వంటివన్నీ తమ పార్టీకే చేటు చేశాయని సీనియర్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.  

భవిష్యత్తు ఏమిటి?
మోదీతో వైరం పెట్టుకుని ఇష్టానుసారం ఆరోపణలు చేశారని, దీని పర్యవసానం తప్పకుండా ఉంటుందనే భయం వారిని వణికిస్తోంది. ఈ ఐదేళ్లలో చేసిన అవినీతి, తప్పులు తమను వెంటాడతాయని, ఇవన్నీ తమ అధినేతను ఎక్కడికి తీసుకెళతాయోననే ఆందోళనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తిరుగులేని విజయాన్ని దక్కించుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొని నిలబడడం కష్టమని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వయసు మీద పడిన దశలో చంద్రబాబు వచ్చే ఐదేళ్లు పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారో అర్థం కావడంలేదని వాపోతున్నారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణులు నైరాశ్యానికి లోనవడంతోపాటు తీవ్ర భయాందోళనల్లోకి నెట్టివేసింది.

ఎన్టీయార్‌ అరుదైన ముద్ర.. 

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రయోగాలకు తెరతీశారు. మొదటిసారి 1983లో గుడివాడ, తిరుపతి; 1985లో గుడివాడ, హిందూపూర్, నల్లగొండ; 1989లో హిందూపూర్, కల్వకుర్తి; 1994లో హిందూపూర్, టెక్కలి నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో ఓటమిచెందిన ఆయన మిగిలిన అన్ని స్థానాల్లోనూ గెలిచారు. ఆయన నెగ్గిన అన్నిచోట్లతో పోలిస్తే  1994లో హిందూపూర్‌లో అత్యధికంగా 60,050 ఓట్లు, అత్యల్పంగా 1985లో గుడివాడనుంచి 7,597 ఓట్ల మెజారిటీ సాధించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top