ఎన్నికల వేళ ఎమ్మెల్యేల రాజీనామాలు

Another Congress MLA Resigns In Gujarat - Sakshi

గాంధీనగర్‌ : రాజ్యసభ ఎన్నికల్లో కనీసం సిట్టింగ్‌ స్థానాల్లో గెలిచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తొలుత మార్చిలో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఐదుగురు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తాజా ప్రకటన రాగానే మరో ఇద్దరు రాజీనామా సమర్పించారు.  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆక్షయ్‌ పటేల్, జితు చౌధరి గురువారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. ఈ షాక్‌ నుంచి తేరుకోకముందు హస్తం పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్‌ నేత బ్రిజేష్‌ మీర్జా రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. కాగా గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. (రాజ్యసభ ఎ‍న్నికలు : కాంగ్రెస్‌కు షాక్‌)

అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌ బలం 73 నుంచి తాజా రాజీనాలతో 65కి పడిపోయింది. దీంతో నాలుగు స్థానాల్లో కనీసం రెండు స్థానాలైనా గెలవాలి అనుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నానికి అధికార బీజేపీ గండికొట్టింది. తాజా పరిణామాలతో బీజేపీ మూడు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఇదిలావుండగా ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక బీజేపీ నేతల ఒత్తిడి ఉందని ప్రతిపక్ష  కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. రెండు స్థానాలు గెలిచే సంఖ్యా బలం తమకు ఉన్నా.. కుట్రపూరితంగానే తమ ఎమ్మెల్యేల చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. (24 రాజ్యసభ సీట్లకు 19న ఎన్నిక)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top