టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టు అయినా తక్కువకు ఇచ్చారా?

Anilkumar Yadav Comments On TDP - Sakshi

పోలవరంపై టీడీపీ దుష్ప్రచారం: మంత్రి అనిల్‌

రివర్స్‌ టెండర్లతో రూ.వందల కోట్ల ప్రజాధనం ఆదా

సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టునైనా తక్కువకు ఇచ్చారా? అని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అని సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంలో పారదర్శకంగా నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇప్పటివరకు రూ. 841.33 కోట్ల మేరకు ఆదా అయిందని, నవంబర్‌ నుంచి పనులు మొదలు పెట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం తమకు ప్రధాన అజెండా అని చెప్పారు. దివంగత వైఎస్సార్‌ మానస పుత్రిక అయిన పోలవరంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదల వల్ల నవంబర్‌ వరకు పనులకు అంతరాయం కలిగితే పోలవరం ఆగిపోయిందంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత వేగంగా పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విజయవంతం అయిందన్నారు. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం వల్లే  నవయుగ సంస్థ రివర్స్‌ టెండర్లలో పాల్గొన లేదని చెప్పారు. మంచి కాంట్రాక్టర్, పారదర్శకత ఉన్నవారైతే బిడ్డింగ్‌లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. 

టీడీపీ నేతల్లో ఆందోళన.. 
నిధులను ఆదా చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంటే తమ బండారం బట్టబయలవుతోందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని  అనిల్‌ పేర్కొ న్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తే టీడీపీని మూసివేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్‌ విసిరారు. వెలిగొండకు కూడా రివర్స్‌ టెండర్లు పిలిచామని, ప్రతి పనికి ఇదే విధానంలో పారదర్శకంగా బిడ్‌లను ఆహ్వానిస్తామన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్‌ మండిపడ్డారు. అది పూర్తిగా అసత్యమని డిజైన్‌ ప్రకారమే నిర్మిస్తామని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని  కూర్చుని మాట్లాడుతున్న ప్రదేశం సాగునీటి శాఖకు చెందినదని మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top