బీజేపీలో ఆయనది అమితమైన స్థానం

Amit Shah Profile of BJP Trouble Shooter - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుడి భుజంగా ఎదిగిన అమిత్‌ షా బీజేపీలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కదిద్దే ట్రబుల్‌ షూటర్‌గా పేరొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన యూపీలో అత్యధిక స్ధానాలు సాధించి పార్టీకి సంపూర్ణ మెజారిటీ దక్కేలా చేయడంలో అమిత్‌ షా పాత్ర విస్మరించలేనిది. పలు రాష్ట్రాలను పార్టీకి కంచుకోటలుగా మలచడంతో పాటు,  ప్రతికూల పరిస్థితులున్న రాష్ట్రాల్లోనూ బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన వ్యూహాలు ఆయువుపట్టుగా నిలిచాయి. 

ఆరెస్సెస్‌ నుంచి పార్టీ చీఫ్‌ వరకూ..
బాల్యంలో ఆరెస్సెస్‌ శాఖలకు హాజరై దిగ్గజ నేతలను దగ్గర నుంచి గమనించిన అమిత్‌ షా అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే స్ధాయికి చేరుకున్నారు. 1964 అక్టోబర్‌ 22న ముంబైలో గుజరాతి హిందూ బనియా కుటుంబంలో షా జన్మించారు. ఆయన తండ్రి అనిల్‌ చంద్ర షా మెహసానాలో పీవీసీ పైపుల వ్యాపారం నిర్వహించేవారు. అమిత్‌ షా మెహసానాలో స్కూల్‌ విద్య పూర్తి చేసుకుని అహ్మదాబాద్‌లోని సీయూ షా సైన్స్‌ కాలేజ్‌లో బీఎస్సీ బయోకెమిస్ర్టీ చదివారు. తొలుత తండ్రి వ్యాపారాన్ని చూసుకున్న షా ఆ తర్వాత స్టాక్‌ బ్రోకర్‌గా, అహ్మదాబాద్‌లోని సహకార బ్యాంక్‌ల లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 

చిన్నతనం నుంచే ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న అమిత్‌ షా 1982లో తొలిసారిగా ఆరెస్సెస్‌ శ్రేణుల్లో నరేంద్ర మోదీని కలిశారు. 1986లో బీజేపీలో చేరిన షా భారతీయ జనతా యువమోర్చాలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి పోటీచేసిన సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ గెలుపు కోసం ప్రచారం చేపట్టారు. 1995లో గుజరాత్‌లో కేశూభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గుజరాత్‌ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రాబల్యాన్ని తట్టుకునేందుకు మోదీ, షా చేసిన కృషి పార్టీలో వీరికి గుర్తింపు తీసుకువచ్చింది. 1990లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన అనంతరం అమిత్‌ షాకు పార్టీలో ప్రాభవం పెరుగుతూ వచ్చింది. 1997లో సర్ఖేజ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన షా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1997, 1998, 2002, 2007లో వరుసగా నాలుగు సార్లు సర్ఖేజ్‌ నుంచి ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నరన్‌పురా నుంచి అమిత్‌ షా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

మోదీ అడుగుజాడల్లో..
 2001 అక్టోబర్‌లో కేశూభాయ్‌ పటేల్‌ స్ధానంలో నరేంద్ర మోదీని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించడంతో అధికార వర్గాల్లో అమిత్‌ షా హవా మొదలైంది. మోదీ సర్కార్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మంత్రిగా అమిత్‌ షా పలు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. గుజరాత్‌ సీఎంగా మోదీ 12 ఏళ్ల ప్రస్ధానంలో షా పలు శాఖలను నిర్వహించారు. ఓ దశలో హోం, న్యాయశాఖ సహా 12 శాఖలను అమిత్‌ షా నిర్వర్తించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా ఆ రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసేలా మంత్రాంగం చేపట్టడంతో పార్టీ అధికారంలోకి రాగానే బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అమిత్‌ షా ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తనదైన వ్యూహాలతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. 

గెలుపు వ్యూహాలు..
అమిత్‌ షా హయాంలో 2014 నుంచి 2016 వరకూ మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, అసోం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా, ఢిల్లీ, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇక 2017లో యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పార్టీని అధికార పగ్గాలు చేపట్టేలా చేయడంలో అమిత్‌ షా మంత్రాంగం పనిచేసింది. గుజరాత్‌లోనూ వరుసగా ఆరో సారి పార్టీ విజయ ఢంకా మోగించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించిన బీజేపీ 2018లో త్రిపురలోనూ పాలక వామపక్ష సర్కార్‌ను ఢీకొని ఆ రాష్ట్రంలో తొలిసారిగా అధికార పగ్గాలు చేపట్టింది. అయితే రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురైంది. 

మెరుపులూ..మరకలూ..
ఇక సుదీర్ఘ రాజకీయ జీవితంలో అమిత్‌ షా పలు ఆటుపోట్లనూ ఎదుర్కొన్నారు. తీవ్రవాది సోహ్రబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బి, వారి అనుచరుడు తులసీరామ్‌ ప్రజాపతి ఎన్‌కౌంటర్‌లో అమిత్‌ షాపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. సోహ్రబుద్దీన్‌ డబ్బు కోసం రాజస్తాన్‌లోని మార్బుల్‌ వ్యాపారులను బెదిరించారని, సోహ్రబుద్దీన్‌ను అంతమొందించేందుకు వీరు అమిత్‌ షాకు భారీ మొత్తం చెల్లించారని సీబీఐ ఆరోపించింది. సోహ్రబుద్దీన్‌ను మట్టుబెట్టేందుకు షా సూచనలతో అప్పటి గుజరాత్‌ డీఐజీ డీజీ వంజార, ఎస్పీ రాజ్‌కుమార్‌ పాండియన్‌ భారీ కుట్రకు తెరలేపారని పేర్కొంది. ఆ మరుసటి ఏడాది ఓ బస్సు నుంచి సోహ్రబుద్దీన్‌, ఆయన భార్య కౌసర్‌బీ, తులసీరాం ప్రజాపతిలను అపహరించి అహ్మదాబాద్‌లోని గెస్ట్‌హౌస్‌కు తరలించిన పోలీసులు అక్కడ వారిని అమానుషంగా హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో పలువురు పోలీస్‌ అధికారులు అరెస్ట్‌ కాగా, వారితో ఫోన్‌లో మాట్లాడిన అమిత్‌ షా సంభాషణలను సీబీఐ సమర్పిస్తూ ఆయనను దోషిగా పేర్కొంది.  ఇదే కేసులో 2010 జులై 25న అమిత్‌ షా అరెస్ట్‌ అయ్యారు. అనంతరం అమిత్‌ షాకు ఈ కేసులో సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. మరోవైపు 2009లో ఓ మహిళపై అమిత్‌ షా అక్రమంగా నిఘా పెట్టారనే ఆరోపణలనూ ఎదుర్కొన్నారు.

హాబీలు
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే అమిత్‌ షా ఒత్తిడిని అధిగమించేందుకు పలు వ్యాపకాలతో సేదతీరుతారు. పుస్తక పఠనం, క్రికెట్‌ వీక్షించడం, సామాజిక సేవలు ఆయనకు ఒత్తిడి నుంచి ఊరటనిస్తాయని చెబుతుంటారు. 

ఇష్టమైన ఆహారం
అమిత్‌ షాకు సహజంగానే ఉత్తరాది, గుజరాతీ వంటకాలంటే మహా ఇష్టం. స్వతహాగా భోజన ప్రియుడైన షాకు అత్యంత ఇష్టమైన వంటకం పోహా అని చెబుతారు. గుజరాతీ స్వీట్లనూ ఆయన ఇష్టంగా ఆరగిస్తారని చెబుతారు.
- మురళి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top