‘అమిత్‌షా హిందువు కాదు, జైనుడు’

Amit Shah Not a Hindu, A Jain, Claims Siddaramaiah - Sakshi

మైసూరు:  పోటాపోటీగా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడిక్కింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు కర్ణాటక ముఖ్యమంత్రి సవాల్‌ విసిరారు. ‘అమిత్‌ షాకు దమ్మూ, ధైర్యం ఉంటే సరైన ఆధారాలతో హిందువునని ఆయన నిరూపించుకోవాలి. ఆయన అచ్చమైన జైనుడు. అమిత్‌ షా ఎంతమాత్రం వైష్ణవ మతస్తుడు కాద’ని శుక్రవారం జరిగిన మైసూరు జిల్లా జర్నలిస్టుల సమావేశంలో పాల్గొన్న సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. 

గత కొంతకాలంగా సిద్దరామయ్య హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేస్తున్న అమిత్‌ షాపై ఆయన ఘాటుగా స్పందించారు. చావులను కూడా రాజకీయం చేయాలని చూసే నీచ రాజకీయాలే బీజేపీ విధానమని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సందర్భంలో కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే స్పందించిన తీరు దారుణమని అన్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే ఆ ప్రమాదం ఘటన చిత్రీకరించారని అనడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు మచ్చుతునక అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 

నిజంగా బీజేపీకి మత పిచ్చి లేదనుకుంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దక్షిణ్‌ కన్నడ’ జిల్లాలో పర్యటించినప్పుడు హిందువుల ఇళ్లల్లోకి వెళ్లి పలకరించిన ఆ పార్టీ నాయకులకు.. అదే ప్రాంతంలో, ప్రమాదం బారిన పడి చనిపోయిన వారి ముస్లిం కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా? అని ప్రశ్నించారు. మతం ముసుగులో రాజకీయాలు చేసే బీజేపీ ద్వంద్వ వైఖరికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top