దమ్ముంటే అరెస్ట్‌ చేయండి

Amit Shah challenges Mamata Banerjee - Sakshi

మమతా బెనర్జీకి అమిత్‌ షా సవాల్‌

బరసత్‌/కన్నింగ్‌: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ జైత్రయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. బంగారు బెంగా ల్‌ను దివాళా బెంగాల్‌గా సీఎం మమత మార్చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడకేసిందని విమర్శించారు. తాను బెంగాల్‌ గడ్డపై జైశ్రీరామ్‌ నినాదం ఇస్తున్నాననీ, దమ్ముంటే మమత తనను అరెస్ట్‌ చేయించాలని సవాల్‌ విసిరారు. బెంగాల్‌లోని కన్నింగ్‌లో ప్రచారంలో అమిత్‌ పాల్గొన్నారు.

మమతకు కోపం వచ్చేస్తుంది
ఇటీవల పశ్చిమ మిడ్నాపూర్‌లో ఓ సభ సందర్భంగా జై శ్రీరామ్‌ నినాదాలు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలపై మమతా బెనర్జీ దూసుకుపోవడాన్ని షా ప్రస్తావించారు. ‘ఎవరైనా జై శ్రీరామ్‌ అని నినాదం ఇస్తే మమతా దీదీకి కోపం వచ్చేస్తుంది. ఈరోజు నేను జై శ్రీరామ్‌ నినాదం ఇస్తున్నాను. మీకు(మమత) నిజంగా దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి. మంగళవారం కూడా నేను కోల్‌కతాలోనే ఉంటాను’ అని సవాల్‌ విసిరారు. జాదవ్‌పూర్‌లోని బరుయిపూర్‌లో తన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడకపోవడంతో బీజేపీ సభ రద్దు కావడంపై అమిత్‌ షా తీవ్రంగా మండిపడ్డారు. కాగా బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ వ్యక్తిగత సహాయకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. అసన్‌స్టోల్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఘోష్‌ సహాయకుడు గౌతమ్‌ చటోపాధ్యాయతోపాటు లక్ష్మీకాంత్‌ షా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ–టీఎంసీ మాటలయుద్ధం
బరుయిపూర్‌లో అమిత్‌ షా సభ రద్దుకావడంపై బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యానికి బదులు నియంత పాలన నడుస్తోందనీ, అందుకే షా హెలికాప్టర్‌ ల్యాండింగ్‌తో పాటు సభకు కూడా అనుమతి ఇవ్వలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గీయ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఈసీ మౌనప్రేక్షకుడిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ నెల 15న యూపీ సీఎం యోగి పాల్గొనే సభకు అధికారులు అనుమతి రద్దుచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top