కక్ష సాధింపు పేరుతో రాష్ట్రపతికి లేఖలా?

Ambati Rambabu Fires On Chandrababu Naidu And TDP - Sakshi

సీబీఐపై చంద్రబాబుకు ఎప్పుడు నమ్మకం కలిగింది: అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎంపీలు ఉన్నవి లేనివి కలిపి వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 52 పేజీల తప్పుడు లేఖను రాష్ట్రపతికి అందజేశారన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవినీతి లేని పాలన అందిస్తుందన్నారు. చంద్రబాబు ఏడాదిగా ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా పైగా వారిపై తాము కక్ష సాధింపు చర్యలు చేస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు తప్పించుకోవాలని చూస్తున్నారన్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండానే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారా.. నడిరోడ్డుపై ఒక వ్యక్తిని కిరాతకంగా నరకడంలో సహకరించిన కొల్లు రవీంద్రను వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. (చదవండి: అచ్చెన్న బెయిల్‌పై విచారణ వాయిదా)

151 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును ఏమి చేయకూడదా.. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అవినీతి రాష్ట్ర ప్రజలందరికి తెలుసు అన్నారు. ఎవరిమీద కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని, విచారణలో అవినీతి బయటపడుతుందని తెలిసే టీడీపీ ఎంపీలు కక్ష సాధింపు పేరుతో రాష్ట్రపతికి లేఖలు ఇస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ రాష్ట్రానికి రావడానికి వీల్లేదని చంద్రబాబు గర్జించారన్నారు. జీవోలు ఇచ్చి వద్దన్న సీబీఐపై చంద్రబాబు ఎప్పుడు నమ్మకం కలిగిందని ప్రశ్నించారు. బాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. ఎన్నికలకు ముందు మోదీ జుట్టు పట్టుకోవాలని చంద్రబాబు చూశారు.. తర్వాత ఆయన కాళ్ల పట్టుకోవాలని బాబు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తన అవినీతి నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపారన్నారు. 

కాళ్ల బేరం కోసమే టీడీపీ ఎంపీలు ఢిల్లీ పర్యటన చేసి రాష్ట్రపతిని కలిశారన్నారు. దొరికిన ఐదున్నర కోట్లు తనవేనని బంగారం వ్యాపారి అంటుంటే బాలినేని దేనని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అది తనది కాదని బాలినేని శ్రీనివాసరావు అంటుంటే ఆయనపై చర్యలు తీసుకోమని టీడీపీ డిమాండ్ చేస్తోందని పేర్కొ​న్నారు. వారు ఏది చెబితే అది రాసే మీడియా ఉంది కదా అని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 2010లో 7 కోట్ల రూపాయలు కదిరిలో దొరికాయి, తర్వాత 7 కోట్ల రూపాయలు చంద్రబాబు కారు నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనంలో దొరికాయి అయితే అప్పుడు చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారా? అని అంబటి ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top