వైఎస్సార్‌సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ

Amalapuram TDP MP Ravindra babu Joins YSRCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావుతో కలిసి రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. (వైఎస్‌ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ)

ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, ఆయన వల్లే ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి మేలు జరుగుతోందని వెల్లడించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌ సీపీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని రవీంద్రబాబు కోరారు. పేదరికం పోవాలంటే వైఎస్‌ జగన్ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీ ఉంటుందని, ఏ కులం​ వారితో ఆ కులం వారిని తిట్టిస్తారని చెప్పారు. అమలాపురం ఎంపీ పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. టీడీపీకి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top