మహారాష్ట్రలో మల్లయుద్ధాలు

Alliance Parties Conflicts in Maharashtra - Sakshi

అసంతృప్తులు.. తిరుగుబాటులు..

కాంగ్రెస్‌లో లోలోన కుమ్ములాటలు

బీజేపీ–శివసేన కూటమిలోనూ అసమ్మతి కుంపట్లు

మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమితో ఎలా తలపడాలో ఆలోచించాల్సిన సమయంలో కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రలో 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తక్షణమే పార్టీలో సీట్లకోసం మల్లయుద్ధాలు ప్రారంభం అయ్యాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు సీనియర్‌ నాయకుడు అశోక్‌ చవాన్‌కీ, చంద్రాపూర్‌కి చెందిన పార్టీ కార్యకర్తకీ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్పింగ్‌ లీక్‌ అవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి వెలుగులోకి వచ్చింది. ఇది అధిష్టానం దృష్టికి సైతం చేరింది. మరో పక్క బీజేపీ, శివసేన పార్టీల్లో సైతం పార్టీ టికెట్‌ దక్కని సిట్టింగ్‌ అభ్యర్థులు పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తామని బెదిరిస్తుండడంతో అవస్థలు పడుతున్నారు.

చంద్రాపూర్‌లో చవాన్‌ అలక పాన్పు
చంద్రాపూర్‌లో తాను సూచించిన అభ్యర్థికి కాకుండా వేరే వ్యక్తికి సీటు కేటాయించడంపై పార్టీ అధిష్టానం వైఖరిపై అలకపాన్పు ఎక్కిన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌ చంద్రాపూర్‌లోని ఓ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ రాష్ట్రంలోని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జాగ్రత్త పడిన కాంగ్రెస్‌ మరుసటి రోజే పార్టీ ప్రకటనని వెనక్కి తీసుకొని వినాయక్‌బాంగాడే స్థానంలో చవాన్‌ సూచించిన  సురేష్‌ ధనోర్కర్‌కి సీటు ఖరారు చేసింది. దీంతో తాత్కాలికంగా అక్కడ అంతర్గత అసంతృప్తిని నివారించినా రాష్టంలోని మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ సీటు దక్కని తిరుగుబాటుదార్ల నుంచి అసంతృప్తి సునామీని ఎదుర్కోక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ని మహారాష్ట్రలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఔరంగాబాద్‌లో అసమ్మతి జ్వాలలు
అశోక్‌ చవాన్‌కి ప్రీతిపాత్రుడైన ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌లో పార్టీ అభ్యర్థి సుభాష్‌ జాంబాద్‌కి వ్యతిరేకంగా స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడంతో చవాన్‌కి మరో షాక్‌ తగిలింది. సత్తార్‌ ఏకంగా అక్కడి ముఖ్యమంత్రిని కలిసి తాను పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేయడంతో అంతా అయోమయంగా మారింది. అయితే సుభాష్‌ జాంబాడ్‌ సత్తార్‌ కోసం తన స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు.

భీవాండీలో భీముడెవరు?
భీవాండీలో కూడా పార్టీ అభ్యర్థి సురేష్‌ తవారే కూడా తమ వారి నుంచి, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన విశ్వనాథ్‌ పాటిల్‌ ఈ సారి కూడా పార్టీ సీటుని ఆశించి, నిరాశచెందారు. మరోవర్గం వారు ఇదే స్థానం నుంచి మాజీ మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన నాయకుడు సురేష్‌ మాత్రేని కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయించాలని తీవ్రంగా యత్నిస్తుండడంతో ఈ ముగ్గురిలో ఈ సీటు ఎవరికిఇవ్వాలో తేల్చుకోలేక కాంగ్రెస్‌ తలబద్దలు కొట్టుకుంటోంది.

సంగ్లీలో సంకటం..
పార్టీ సంగ్లీ యూనిట్‌ సైతం అసంతృప్తి భూతాన్ని అణచిపెట్టలేక అవస్థలు పడుతోంది. అక్కడ మాజీ కేంద్ర మంత్రి ప్రతీక్‌ పాటిల్‌ ఆదివారం పార్టీకి గుడ్‌బై చెప్పేయడంతో సంగ్లీ పార్టీ యూనిట్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. కేవలం ప్రతీక్‌ మాత్రమే కాకుండా, ఆయన వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే విశ్వజీత్‌ కదం కూడా ఈ సీటుని రాజుశెట్టి నాయకత్వంలోని స్వాభిమాని పక్షకి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్నారు.

శివసేనలోనూ లుకలుకలు
అహ్మద్‌నగర్‌లో బీజేపీ శివసేన క్యాంపులో సైతం అసమ్మతి ఆ పార్టీలను ముప్పతిప్పలు పెడుతోంది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సిట్టింగ్‌ లోక్‌ సభ సభ్యుడు దిలీప్‌గాంధీ తన కుమారుడు సురేంద్రని స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించి తిరుగుబాటు  బావుటా ఎగురవేశారు. ఇక్కడ ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన  సుజయ్‌ విఖే పాటిల్‌ కోసం బీజేపీ ఈ  సీటుని ఖాళీ చేయించింది.
 

భండారా గోండియా నుంచి పార్టీ అభ్యర్థిగా సునీల్‌ మేంధే పేరుని ప్రకటించడంతో పార్టీకి రాజీనామా చేస్తానంటూ బీజేపీ నాయకుడు రాజేంద్ర పాటిల్‌ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి పార్టీలో చేరిన రంజిత్‌ నాయక్‌ నింబాల్కర్‌ని బీజేపీ మాధ నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. దీంతో ఇటీవలనే ఎన్‌సీపీ నుంచి బీజేపీలో చేరిన రంజిత్‌ సిన్హా మోహిత్‌ పాటిల్‌  ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఉస్మానాబాద్‌ శివసేన సిట్టింగ్‌ ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు సీటు దక్కలేదు. ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఉస్మానాబాద్‌లో తన మద్దతుదారులతో శనివారం సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆయన అనుచరులు కొంత మంది ముంబైలో నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు. మొత్తం శివసేనకున్న 18 మంది లోక్‌సభ సభ్యుల్లో తిరిగి సీటు దక్కని ఏకైక ఎంపీ గైక్వాడ్‌. దీనికి ప్రధాన కారణం గతంలో ఎంపీ రవీంద్రగైక్వాడ్‌ విమానాశ్రయంలో అక్కడి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి, దేశవ్యాప్త నిరసనలకు కారణమయ్యారు. ఇది పార్లమెంటుని సైతం ఆ రోజు ఓ కుదుపు కుదిపింది. అందుకే శివసేన ఈసారి గైక్వాడ్‌కి సీటు నిరాకరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top