రిజర్వేషన్లు తగ్గిస్తే ‘పంచాయితే’  | All party leaders warns state govt on BC reservations | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు తగ్గిస్తే ‘పంచాయితే’ 

Dec 29 2018 1:39 AM | Updated on Dec 29 2018 1:39 AM

All party leaders warns state govt on BC reservations - Sakshi

శుక్రవారం సచివాలయంలో సీఎస్‌ ఎస్‌కే జోషికి వినతి పత్రం ఇస్తున్న అఖిలపక్ష నేతలు

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గిస్తే ఊరుకోబోమని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. తక్షణమే బీసీల రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతంగా అమలు చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం ప్రకారం వెంటనే బీసీ జనగణన నిర్వహించి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీహెచ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లెఫ్ట్, ఇంటిపార్టీ నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్‌ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను రాజకీయంగా అణచివేసే ప్రక్రియను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదలు పెట్టిందని ఆరోపించారు. బీసీ జనగణన లెక్కలు లేకపోవడంతో కోర్టు తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తున్నాయని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ఎల్‌.రమణ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు రావడంతో తెలంగాణలో దొరల, పటేళ్ల రాజ్యం తగ్గిందని, ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించి మళ్లీ పెత్తందారీ వ్యవస్థ పెరిగేలా చూస్తున్నారని వాపోయారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వేషన్లు తగ్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు... 
పొన్నాల, వీహెచ్‌ మాట్లాడుతూ బీసీలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎవరికీ రిజర్వేషన్లు తగ్గించకుండా బీసీల మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు కాయడానికే బీసీలుండాలని కేసీఆర్‌ భావిస్తున్నారా.. అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల ముట్టడికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మద్దతు ప్రకటించారని తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ రెండో సారి సీఎం అయ్యాక ప్రధాని నరేంద్రమోదీని కలసి 16 డిమాండ్లు అడిగినప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. దీనిపై కనీసం చర్చకు రాకపోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు. శనివారం జరిగే రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి యథా తథంగా ఉంటుందన్నారు. జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం పెంచేదిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాండురంగాచారి, టీజేపీ నేత ప్రకాశ్, బీసీ నేతలు ఎస్‌. దుర్గయ్య, తాటికొండ విక్రంగౌడ్, గొడుగు మహేశ్, కొటికే రాము, కొప్పుల చందు, లక్ష్మణ్, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement