
నాలుగున్నర ఏళ్లుగా లోక్‌పాల్ బిల్లు ఎక్కడికెళ్లిందో మోదీ..
హైదరాబాద్: బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను కొత్తగా తెరపైకి తెచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ ఎంపీ ఎంవీ రాజీవ్ గౌడ విమర్శించారు. మంగళవారం రాజీవ్ గౌడ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని ఆరోపించారు. మోదీ పాలనలో దేశంలో సెక్యులరిజానికి రక్షణ లేదన్నారు. రైట్ వింగ్ శక్తులను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి బంధాన్ని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. నాలుగున్నర ఏళ్లుగా లోక్‌పాల్ బిల్లు ఎక్కడికెళ్లిందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ, అమిత్ షాల అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు రైటు టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐలను కూడా మోదీ అప్రజాస్వామిక విధానాలకు వాడుతున్నారని విమర్శించారు. ఆర్‌బీఐ గవర్నర్‌లుగా ఉండలేమని చెబుతుండటమే మోదీ పాలన తీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. రాఫెల్ ధరను రక్షణ మంత్రి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అది బీజేపీ ఆస్తికాదు.. ప్రజల సొమ్మని అన్నారు. రాఫెల్‌పై సుప్రీం కోర్టుకు ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు.
దేశానికి 126 ఎయిర్ క్రాఫ్ట్‌లు అవసరం ఉంటే మోదీ 36 ఎయిర్ క్రాఫ్ట్‌లు మాత్రమే కొనుగోలు చేశారని..ఇది దేశ భద్రతకు నష్టమా కాదా చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లు అబద్ధాలు, మోసాలతో మోదీ పాలన సాగిందని విమర్శించారు. దేశ రక్షణపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మోదీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. మమతా బెనర్జీ గొప్ప సెక్యులర్ వాదీ అని, ఆమె కాంగ్రెస్‌తోనే ఉంటారని అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో పార్టీ ఓటమిని సమీక్షించుకుంటామని చెప్పారు.