ఏపీ మంత్రులతో రాకేష్‌కు లింకులు

Actor among 3 more arrested in NRI chigurupati jayaram murder case - Sakshi

జయరామ్‌ హత్య తర్వాత  వారికి ఫోన్లు 

టీడీపీ నేతల పాత్రపై లోతుగా  ఆరా తీస్తున్నామన్న విచారణాధికారి 

ఈ కేసులో 15 రోజుల్లో  అభియోగపత్రాలు దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, ప్రవాసభారతీయుడు చిగురుపాటి జయరామ్‌ను హత్యచేసిన రాకేష్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రులతో సంబంధాలున్నాయని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జయరామ్‌ హత్యానంతరం హంతకుడు అక్కడి అమాత్యులకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తేలిందన్నారు. కేసు దర్యాప్తులో ఏపీ మంత్రులతో ఉన్న పరిచయ కోణాన్నీ పరిగణనలోకి తీసుకుని లోతుగా ఆరా తీస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన సందర్భంగా గురువారం విలేకరుల సమా వేశం ఏర్పాటుచేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం. 10లో ఉన్న రాకేష్‌ ఇంట్లో జనవరి 31న జయరామ్‌ హత్య జరిగిన విషయం విదితమే. మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లిన రాకేష్‌ ఏపీలోని నందిగామ సమీపంలో వదిలిపెట్టి వచ్చారు. తొలుత ఏపీలో నమోదైన ఈ కేసు.. ఆపై తెలంగాణకు బదిలీ కావడంతో బంజారాహిల్స్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి జయరామ్‌ హత్యకు ముందు, ఆ తర్వాతా ఏపీ మంత్రులతో మాట్లాడాడు. అయితే హత్యకు సంబంధించిన వివరాలు మాట్లాడారా? మరేదైనా చర్చించారా? అనేది దర్యాప్తులో తేలుతుందని డీసీపీ తెలిపారు. రాకేష్‌ కాల్‌ డిటేల్స్‌ అధ్యయనం చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు, ఆ పార్టీ కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలిందని పేర్కొన్నారు.
 
4 నెలల క్రితమే ప్లానింగ్‌! 
ఆర్థిక వివాదాల నేపథ్యంలో జయరామ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న రాకేష్‌.. ఈ ఘాతుకానికి 4 నెలల క్రితమే ప్లాన్‌ చేశాడు. జయరామ్‌ వ్యవహార శైలి తెలిసిన రాకేష్‌ కొత్త సిమ్‌కార్డు తీసుకుని హనీట్రాప్‌ను వీణ పేరుతో అమలుచేశాడు. జయరామ్‌ను ‘జై’అని పిలుస్తూ వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. వీరి మధ్య మొత్తం 170 చాటింగ్స్‌ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జయరామ్‌ను నిర్భంధించాలని కుట్రపన్నిన రాకేష్‌.. జనవరి 30న వీణ పేరు తో లంచ్‌కు ఆహ్వానించాడు. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌కు వస్తే అక్కడ నుంచి కలిసి వెళ్దామంటూ వాట్సాప్‌ సందేశం పెట్టాడు. అతడు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రౌడీషీటర్‌ నగేష్‌ను రమ్మని పిలిచాడు. ఓ వ్యక్తిని నిర్బంధించి డబ్బు వసూలు చేద్దామన్నాడు. దీనికోసం విశాల్‌ (నగేష్‌ సమీప బంధువు)నూ లైఫ్‌సెటిల్‌ చేస్తానంటూ తనతో కలుపుకున్నాడు. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న చిలకట్ల సూర్యప్రసాద్‌ (30) అలియాస్‌ సూర్య తాను నిర్మిస్తున్న కలియుగ సినిమా కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం రాకేష్‌ను ఆశ్రయించాడు. జనవరి 30న రాకేష్‌ను కలిసేందుకు అతడి ఇంటికి వస్తూ తన స్నేహితుడైన ‘కలియుగ’అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిశోర్‌ను తీసుకువచ్చాడు. దీంతో నగేష్, విశాల్‌లను ఇంట్లోనే ఉంచిన రాకేష్‌.. వీరిద్దరినీ తీసుకుని బయలుదేరాడు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌ వరకు వచ్చాక జయరామ్‌ కారు నంబర్‌ కిశోర్‌కు చెప్పి అతడికి అక్కడ దింపేశాడు. అందులో జై అనే వ్యక్తి వస్తారని, అతడిని వీణ మేడం డ్రైవర్‌ని అంటూ పరిచయం చేసుకుని, అతడి కారులోనే తన ఇంటికి తీసుకురమ్మని రాకేష్‌ చెప్పడంతో కిశోర్‌ అలానే చేశాడు. ఇంటికి వచ్చాక సూర్య, కిశోర్‌లు కింది నుంచే వెళ్లిపోగా.. రాకేష్‌ సహా మిగిలిన ఇద్దరూ జయరామ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు.  

స్టాంపు పేపర్లపై సంతకాలు 
జయరామ్‌ను బెదిరించిన రాకేష్‌ కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్‌ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్‌పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్‌ చేసుకున్నాడు. మరుసటి రోజు (జనవరి 31) విశాల్‌తో కలిసి జయరామ్‌ను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. జయరామ్‌ దేహం ఇంట్లో ఉండగానే రియల్టర్‌ అంజిరెడ్డి ఓ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విషయం మాట్లాడటానికి అక్కడకు వచ్చాడు. చింతల్‌లో కేబుల్‌ వ్యాపారం కూడా చేస్తున్న అంజిరెడ్డి.. ఇంట్లో రాకేష్‌ మృతదేహం చూసి భయపడ్డాడు. తిరిగి వెళ్తున్న అంజిరెడ్డికి.. జయరామ్‌ నుంచి సంతకాలు తీసుకున్న ఖాళీ పత్రాలను రాకేష్‌ ఇచ్చి పంపాడు. ఇలా జయరామ్‌ కేసులో అంజిరెడ్డి, సూర్య, కిశోర్‌ నిందితులుగా మారారని డీసీపీ శ్రీనివాస్‌ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. జయరామ్‌ మేనకోడలు శిఖాచౌదరికి ఈ హత్యతో సంబంధం లేదన్న డీసీపీ.. జయరామ్‌ భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు ఆమెపై నమోదైన కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను విచారించామని.. వారిచ్చిన సమాధానాల ఆధా రంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. గతంలో ప్రగతి రిసార్ట్స్‌ యజమానిని బెదిరించి బలవంతంగా భూమిని రాయించుకున్న రాకేష్‌ అప్పట్లో పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భయపెట్టించారని డీసీపీ చెప్పారు. చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు దర్యాప్తు పూర్తికావస్తోందని, 15 రోజుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామని తెలిపారు.

తెలిసి తప్పు చేయలేదు
జయరామ్‌ హత్య కేసులో గురువారం అరెస్టు అయిన సినీ నటుడు సూర్య విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని ఈ వీడియోలో సూర్య తెలిపాడు. 47 సెకన్ల నిడివితో ఉన్న ఆ వీడియోలో.. ‘హలో అండి నా పేరు సూర్య. ఈ రాకేష్‌రెడ్డి, శిఖా చౌదరి, చిగురుపాటి జయరామ్‌ కేసులో మాకు ఎలాంటి ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదు. యాక్చువల్లీ రాకేష్‌ నాకు ఫోన్‌ చేసినప్పుడు కిశోర్‌ నా పక్కనే ఉన్నాడు. కిశోర్‌ నాకు ఫైవ్‌ ఇయర్స్‌ నుంచి ఫ్రెండ్‌. నేను మహా అయితే రాకేష్‌ను నాలుగైదుసార్లు కలిశానంతే. కిశోర్‌ తన పనిలో ఉంటే నేనే అతడికి తీసుకెళ్లాను. ఇక్కడే అన్న పిలిచాడు అంటూ చెప్పి వెళ్లొద్దామని చెప్పి వెళ్లాం. తర్వాత రాకేష్‌రెడ్డి అన్నవాడు మమ్మల్ని ఎలా వాడుకున్నాడో మీకు తెలిసిందే. కిశోర్‌కు డ్రైవింగ్‌ కూడా రాదు. నేను పిలవడం వల్లే వచ్చాడు. సో.. ప్లీజ్‌! తెలిసైతే మేము తప్పు చేయలేదు. ప్లీజ్‌ వీలైతే హెల్ప్‌ చెయ్యండి’అని అభ్యర్థించాడు.
– సూర్య సెల్ఫీ వీడియో  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top