కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం

700 Crores Business in Call Money Cases, Says AP Home Minister - Sakshi

ఈ వ్యవహారంలో మొత్తం 18 కేసులు నమోదు

శాసనమండలిలో హోంమంత్రి సుచరిత వెల్లడి

సాక్షి, అమరావతి: కాల్‌మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని ఏపీ హోం‍మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసన మండలిలో కాల్‌ మనీ కేసులకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం సమాధానమిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కాల్‌ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడలో 14, పశ్చిమ గోదావరిలో మూడు, కడపలో ఒక కేసు నమోదైనట్టు వివరించారు. విజయవాడలో ఈ కేసులకు సంబంధించి మొత్తం 30 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఏడుగురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా గతంలో  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. 

బీసీల కోసం 139 కార్పొరేషన్లు
వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మొత్తం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు  బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన అనేక మంది తమ సమస్యలు తెలుసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర నూతన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసన మండలి సభ్యులు గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top