
ఆయేగాతో మోదీ హీ(ఈసారి వచ్చేది కూడా మోదీనే).. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా వాడిన నినాదమిది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అచ్ఛేదిన్ ఆనేవాలే హై(మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో బీజేపీ ఘనవిజయం సాధించింది. అదే తరహాలో ఈసారి మైభీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే) అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కానీ దానికంటే ‘ఆయేగాతో మోదీ హీ’నినాదం చాలా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేని విషయాన్ని ఈ నినాదం ద్వారా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాజకీయ విశ్లేషకుడు ఒకరు తెలిపారు. అదే సమయంలో మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరనీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీకి దీటైన ప్రత్యర్థి కారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. ఓవైపు మోదీ, మరోవైపు మాయావతి, రాహుల్ గాంధీ, అఖిలేశ్ ఉండటంతో జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు మోదీకే జైకొట్టారని అభిప్రాయపడ్డారు.