కర్ణాటక సంక్షోభం: వ్యూహాత్మకంగా స్పీకర్‌ నిర్ణయం!

11 members resigned, I will see them on Monday, Says Karnataka Speaker - Sakshi

అధికార కూటమికి చెందిన 11 మంది ఎమ్మెల్యేల రాజీనామా

రాజీనామాలపై నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేసిన సభాపతి

రేపు సెలవు కావడంతో నిర్ణయం దాటవేత

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోంది.  కొద్దిరోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తాజాగా శనివారం మరో 11 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ కార్యాలయంలో అందజేశారు. అయితే, వారు రాజీనామా లేఖలు అందించే సమయంలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తన కార్యాలయంలో అందుబాటులో లేరు. అధికార సంకీర్ణ కూటమికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సమయంలో స్పీకర్‌ అందుబాటులో లేకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

‘నా కూతుర్ని పికప్‌ చేసుకోవడానికి నేను ఇంటికి వెళ్లాను. రాజీనామా లేఖలు స్వీకరించి.. లేఖలు తీసుకున్నట్టు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని నా కార్యాలయానికి సూచించాను. 11 మంది రాజీనామా చేశారు. రేపు (ఆదివారం) సెలవు కాబట్టి, సోమవారం వారి రాజీనామాల సంగతి చూస్తాను’ అని ఆయన వెల్లడించారు. రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయం అత్యంత కీలకం​ కావడంతో ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా ఆయన దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్పీకర్‌  ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే.. కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.  

కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా బీజేపీ 105, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్పీ 1, ఇతరులు 2 ఉన్నాయి. గతంలో ఇద్దరు, ఇప్పుడు 11 మంది సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో బలపరీక్ష జరిగితే.. బీజేపీ సులువగా బలపరీక్షలో నెగ్గి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top