
స్క్వాష్ @ 800 ఏళ్లు
తవ్వకాల్లో బయటపడిన 800 ఏళ్ల నాటి విత్తనాల్ని సాగు చేస్తున్నారు కెనడాలోని విన్నీపెగ్‌కు చెందిన కెనడియన్ మెన్నోనైట్ విశ్వవిద్యాలయం విద్యార్థులు.
తవ్వకాల్లో బయటపడిన 800 ఏళ్ల నాటి విత్తనాల్ని సాగు చేస్తున్నారు కెనడాలోని విన్నీపెగ్‌కు చెందిన కెనడియన్ మెన్నోనైట్ విశ్వవిద్యాలయం విద్యార్థులు. బడి, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో మొక్కల్ని పెంచడం సర్వసాధారణం. అయితే కెనడాలోని కెనడియన్ మెన్నోనైట్ యూనివర్శిటికి చెందిన విద్యార్థులు మాత్రం పురాతన విత్తనాల్ని సాగుచేస్తూ వార్తల్లో నిలిచారు. కెనడాలోని పురావస్తు శాస్త్రరీత్యా ప్రాధాన్యత కలిగిన ‘ఫస్ట్ నేషన్స్ ల్యాండ్’ ప్రదేశాల్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన విత్తనాలు వెలుగు చూశాయి. ఈ తవ్వకాల్లో 800 ఏళ్ల నాటి మట్టి పాత్ర ఒకటి బయటపడింది.
ఆ పాత్రనిండా విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలను స్క్వాష్ విత్తనాలుగా గుర్తించారు పురావస్తు విభాగం శాస్త్రవేత్తలు. ఈ విత్తనాలను కెఎంయూకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున సాగు చేయడం మొదలు పెట్టారు. ఆ విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరుగుతున్నాయి. మరికొన్ని మొక్కలు కాయల్ని కూడా కాస్తున్నాయి. చూడ్డానికి కూరగాయకంటే పెద్దగా ఉన్న ఈ స్క్వాష్ కాయ చాలా పొడవుగా పెరుగుతోంది. అయితే, విద్యార్థులు మాత్రం ఈ కాయను విత్తనాల కోసం అలాగే ఉంచేస్తున్నారు. ‘ఈ స్క్వాష్ కూరగాయ గిరిజన తెగకు చెందిన ఓ వర్గానికి ప్రతీకగా మేం భావిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఈ స్క్వాష్ కాయను అందించాల నుకుంటున్నాం. ఈ స్క్వాష్ కాయనుంచి మరిన్ని విత్తనాలు సేకరించాలనుకుంటున్నాం. ఈ స్క్వాష్ విత్తనాన్ని మరోసారి నాశనం కానివ్వమంటు’న్నారు విన్నీపెగ్ కు చెందిన మొక్కల పెంపకం సమన్వయకర్త బ్రెయిన్ ఎత్కిన్.