ప్రాంతీయ అస్తిత్వపు దర్శనం | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ అస్తిత్వపు దర్శనం

Published Sat, Jun 13 2015 11:19 PM

ప్రాంతీయ అస్తిత్వపు దర్శనం

కర్నూలు సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల విడిపోయిన సమైక్య తెలుగు నేలకు ప్రతిరూపం. అన్ని ప్రాంతాల విద్యార్థులూ అక్కడ డిగ్రీ విద్యను అభ్యసిస్తారు. ఆ కళాశాల తెలుగు శాఖ, ‘తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం’  అంశంపై యు.జి.సి. జాతీయ సదస్సు నిర్వహించి, తెలుగు వాళ్లున్న ప్రతి నిర్దిష్ట స్థలం నుండీ తెలుగు కథ ఎలా ప్రాంతీయ సువాసనల్ని వెదజల్లిందో, ఉద్దండులతో ప్రసంగ వ్యాసాలు వినిపించి, వాటిని వాయలీనం కాకుండా పుస్తక రూపంలో తెచ్చింది.

 తెలుగునేల మీది నాలుగు ప్రాంతాల కథ మీద విశ్లేషణతో పాటు పూర్వపు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక గిరికి బయటి మహారాష్ట్ర, తమిళనాడు, అమెరికాలోని తెలుగు కథల మీద కూడా విశ్లేషణలు కలుపుకున్నదీ పుస్తకం. దీనికి అదనంగా నిర్దిష్టతలో మరింత నిర్దిష్ట అధ్యయనంగా కర్నూలు, గుంటూరు, కరీంనగర్ జిల్లాల ప్రాంతీయ కథల్ని కూడా పరామర్శిస్తూ, పి.యశోదారెడ్డి, నాగప్పగారి సుందరరాజు, గూడూరి సీతారాం వంటివారి కథల్లోని ప్రాంతీయ అస్తిత్వాల్ని పట్టిచూపే ప్రయత్నాలు ఉన్నాయి. కె.శ్రీనివాస్, ‘ఏకత్వం భిన్నత్వం: తెలుగు కథ’, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ‘ప్రాంతీయతే జీవధాతువు’, స్వామి ‘అవధుల్లేని ప్రాంతీయ అస్తిత్వాలు’ ఇత్యాది వ్యాసాలు అమూల్యమైనవి.
 తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం దాని చుట్టూ వున్న చైతన్య, తాత్త్వికతల మీద ఈ పుస్తకం విలువైన విశ్లేషణ చేస్తుంది. ఇందులోని వ్యాస రచయితలు ఒక్కో ప్రాంతపు కథను 10-15 సంవత్సరాల కాలవ్యవధుల్లో పరిశీలిస్తూ ఎంతో లోతైన చర్చను చేశారు. ఒకే ప్రాంతంలోని ప్రాంతీయ వస్తు రూపాలు నిర్దిష్ట కాల పరిమితుల్లో ఎట్లా పరిణామశీలతను పొందాయో, లేదూ గిడసబారి పోయాయో వివరించాయి. ఆశ్చర్యంగా ప్రాంతీయ అస్తిత్వపు వింగడింపు కిందకి రాని కోస్తా కథను కూడా ఆ దృష్టితో చూడడానికి ఈ పుస్తకంలో ఒక ప్రయత్నముంది. ఆ దృష్ట్యా వాసిరెడ్డి నవీన్ వ్యాసం విలువైంది.

సంస్కార ఉద్యమాల ప్రతిఫలంగా సంస్కరణ వాద కథాంశాల తల్లిగా భావించే ఉత్తరాంధ్రలోని ప్రాంతీయ విశిష్టతల్ని అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, కోస్తాంధ్ర ప్రాంతపు అంచుల్లో సూక్ష్మదృష్టికి అగుపడే అస్తిత్వ వేదనల్ని కాట్రగడ్డ దయానంద్ వ్యాసాలు వివరిస్తాయి.

జి.వెంకటకృష్ణ
 తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం; సంపాదకులు: వెల్దండి శ్రీధర్
 పేజీలు: 384; వెల: 300; ప్రతులకు: సంపాదకుడు, 303, కేపీఎస్ గ్రాండ్ అపార్ట్‌మెంట్, ఏ క్యాంప్, చాణక్యపురి కాలనీ, కర్నూల్; ఫోన్: 9866977741
 

Advertisement
Advertisement