breaking news
The National Convention
-
నైతిక విలువలు పెంపొందించుకోవాలి
జాతీయ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ అనంతపురం ఎడ్యుకేషన్ : నైతిక విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. లక్ష్మీనారాయణ సూచించారు. 'భారత దేశంలో తయారీ –బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి అధ్యక్షత వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంగ్లవిద్య ప్రాముఖ్యతను వివరించారు. సమైక్య ఆలోచనలు, భావవ్యక్తీకరణ, నైతిక విలువలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతోపాటు, అమెరికాలో పరిశోధన స్థాయిలో ఉన్న రోబో టెక్నాలజీ ఎలక్ట్రానిక్ కార్లు, జన్యు విప్లవం వల్ల ఎదుయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వివరించారు. ఎస్కేయూ మాజీ ఆచార్యుడు నాగేశ్వరరావు, సదస్సు కన్వీనర్ డాక్టర్ జి. అయ్యన్న, కార్యదర్శి కె. శివరామ్, అర్థశాస్త్ర విభాగాధిపతి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కె. శ్రీధర్, డాక్టర్ ఎంవీ శేషయ్య, డాక్టర్ పీఎస్ లక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘల్లుమన్న గిరిజనం
మహిళా సర్పంచ్‌లకు ఘన స్వాగతం 10 రాష్ట్రాల నుంచి 850 మంది హాజరు జాతీయ సదస్సులో ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు హాజరైన కేంద్ర మంత్రులు, సీఎం గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సుకు విజయవాడ వేదికైంది. పది రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మహిళా సర్పంచులకు ఘన స్వాగతం లభించింది. గిరిజనులు ప్రదర్శించిన వివిధ సంప్రదాయ నృత్యాల్లో వారితో కలిసి కేంద్రమంత్రులు, సీఎం చంద్రబాబు కాలు కదిపారు. ఈ సదస్సు సందర్భంగా మహిళా సర్పంచులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. -
ప్రాంతీయ అస్తిత్వపు దర్శనం
కర్నూలు సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల విడిపోయిన సమైక్య తెలుగు నేలకు ప్రతిరూపం. అన్ని ప్రాంతాల విద్యార్థులూ అక్కడ డిగ్రీ విద్యను అభ్యసిస్తారు. ఆ కళాశాల తెలుగు శాఖ, ‘తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం’ అంశంపై యు.జి.సి. జాతీయ సదస్సు నిర్వహించి, తెలుగు వాళ్లున్న ప్రతి నిర్దిష్ట స్థలం నుండీ తెలుగు కథ ఎలా ప్రాంతీయ సువాసనల్ని వెదజల్లిందో, ఉద్దండులతో ప్రసంగ వ్యాసాలు వినిపించి, వాటిని వాయలీనం కాకుండా పుస్తక రూపంలో తెచ్చింది. తెలుగునేల మీది నాలుగు ప్రాంతాల కథ మీద విశ్లేషణతో పాటు పూర్వపు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక గిరికి బయటి మహారాష్ట్ర, తమిళనాడు, అమెరికాలోని తెలుగు కథల మీద కూడా విశ్లేషణలు కలుపుకున్నదీ పుస్తకం. దీనికి అదనంగా నిర్దిష్టతలో మరింత నిర్దిష్ట అధ్యయనంగా కర్నూలు, గుంటూరు, కరీంనగర్ జిల్లాల ప్రాంతీయ కథల్ని కూడా పరామర్శిస్తూ, పి.యశోదారెడ్డి, నాగప్పగారి సుందరరాజు, గూడూరి సీతారాం వంటివారి కథల్లోని ప్రాంతీయ అస్తిత్వాల్ని పట్టిచూపే ప్రయత్నాలు ఉన్నాయి. కె.శ్రీనివాస్, ‘ఏకత్వం భిన్నత్వం: తెలుగు కథ’, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ‘ప్రాంతీయతే జీవధాతువు’, స్వామి ‘అవధుల్లేని ప్రాంతీయ అస్తిత్వాలు’ ఇత్యాది వ్యాసాలు అమూల్యమైనవి. తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం దాని చుట్టూ వున్న చైతన్య, తాత్త్వికతల మీద ఈ పుస్తకం విలువైన విశ్లేషణ చేస్తుంది. ఇందులోని వ్యాస రచయితలు ఒక్కో ప్రాంతపు కథను 10-15 సంవత్సరాల కాలవ్యవధుల్లో పరిశీలిస్తూ ఎంతో లోతైన చర్చను చేశారు. ఒకే ప్రాంతంలోని ప్రాంతీయ వస్తు రూపాలు నిర్దిష్ట కాల పరిమితుల్లో ఎట్లా పరిణామశీలతను పొందాయో, లేదూ గిడసబారి పోయాయో వివరించాయి. ఆశ్చర్యంగా ప్రాంతీయ అస్తిత్వపు వింగడింపు కిందకి రాని కోస్తా కథను కూడా ఆ దృష్టితో చూడడానికి ఈ పుస్తకంలో ఒక ప్రయత్నముంది. ఆ దృష్ట్యా వాసిరెడ్డి నవీన్ వ్యాసం విలువైంది. సంస్కార ఉద్యమాల ప్రతిఫలంగా సంస్కరణ వాద కథాంశాల తల్లిగా భావించే ఉత్తరాంధ్రలోని ప్రాంతీయ విశిష్టతల్ని అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, కోస్తాంధ్ర ప్రాంతపు అంచుల్లో సూక్ష్మదృష్టికి అగుపడే అస్తిత్వ వేదనల్ని కాట్రగడ్డ దయానంద్ వ్యాసాలు వివరిస్తాయి. జి.వెంకటకృష్ణ తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం; సంపాదకులు: వెల్దండి శ్రీధర్ పేజీలు: 384; వెల: 300; ప్రతులకు: సంపాదకుడు, 303, కేపీఎస్ గ్రాండ్ అపార్ట్మెంట్, ఏ క్యాంప్, చాణక్యపురి కాలనీ, కర్నూల్; ఫోన్: 9866977741