ఏటి ఒడ్డున ఏం ఉంటుంది? ఎవరో విడిచి వెళ్లిన నాలుగు కన్నీటి చుక్కలు విడిది చేసిన కొన్ని మసక సంభాషణలు..
ఏటి ఒడ్డున ఏం ఉంటుంది?
ఎవరో విడిచి వెళ్లిన నాలుగు కన్నీటి చుక్కలు
విడిది చేసిన కొన్ని మసక సంభాషణలు
విడిచేసిన ఏకాంతపు ముఖాలు
ఇసకలో దిగులు గుంతల వలయాలు
ఏటి ఒడ్డున ఇంతకన్నా ఏం ఉంటాయి?
జలజల పారే ఏటి సవ్వడిలో
కలిసి తడిసిపోయిన
కొంత పొడి దుఃఖం
ఏటి ఒడ్డున అంతకన్నా ఏం ఉంటుంది?
ఏటి ఒడ్డున ఇంకా...
రంగు రంగుల గులకరాళ్లు
పగిలిన నత్త గుల్లలు
మువ్వల శబ్దాలు మోసే పాద ముద్రలు
పగటి మబ్బుల మీద కొలువు దీరిన వెన్నెల దీపాలు
అంతేనా-
ఒక పేరు లేని ప్రేయసి
ఊరు లేని స్నేహితుడు
ఒక అభౌతిక కౌగిలింత
ఒక అధిభౌతిక కరచాలనమూ ఉంటాయి
ఏటి ఒడ్డున...
ఇంకా- ఏటి ఒడ్డున ఇవేవీ పట్టనట్టు
తుళ్లుతూ పరవళ్లు తొక్కుతూ పారే
ఏరు కూడా ఉంటుంది!
- పసునూరు శ్రీధర్ బాబు