పాలక భావజాలం చేసిన హత్య

పాలక భావజాలం చేసిన హత్య - Sakshi


విశ్లేషణ

తండ్రికంటే గౌరి ఎక్కువ వామపక్షవాది. కానీ, ఆమె లౌకికవాదం బసవన్న నాటి నుంచి కన్నడనాట సాంస్కృతికంగా వేళ్లూనుకుని ఉన్న సమానత్వవాద సాంప్రదాయపు కొనసాగింపే. ఇలాంటి లౌకికవాద సంప్రదాయం అంటేనే సంఘ్‌పరివార్‌కు భయం ఎక్కువ. దాన్ని పాశ్చాత్య మేధోవాదంగా తోసిపారేయలేరు. భావమయ జీవితాన్ని జీవించిన గౌరి అందుకు తగ్గట్టే ఒక భావజాలం చేతుల్లో హత్యకు గురయ్యారు. ఆ భావజాలం మన రాజ్యాంగానికి విరుద్ధమైనది, హిందూ మతంలోని వివిధ శాఖలను తన అస్తిత్వానికి ముప్పుగా భావించేది.



గౌరీ లంకేశ్‌ను చంపింది ఏమిటి? ‘‘గౌరీ లంకేశ్‌ను చంపింది ఎవరు?’’ అనే ప్రశ్నా ఒక్కటే కావు. లంకేశ్‌ను చంపింది ఏమిటి? అనేది మరింత లోతైన, మరింత ఉపయుక్తమైన ప్రశ్న. బహిరంగ చర్చలో మనం అర్థవంతమైన సమాధానం చెప్పగల ప్రశ్న ఇది మాత్రమే. ఒక హత్య నాలుగు రకాల అపరాధాలతో కూడినదిగా ఉంటుంది: హత్యను చేసిన వారు ఎవరు, అందుకు కుట్ర పన్నినది ఎవరు, దానిని ప్రోత్సహించినవారు లేదా దాని వల్ల లబ్ధి పొందేవారు ఎవరు, అందుకు ఆమోదం తెలిపినవారు ఎవరు అనేవి. ఇందులో మొదటి రెండు అంశాలను మనం పోలీసులకు వదిలి పెట్టేయాలి. హంతకులు, కుట్రదారుల గురించి హడావుడిగా నిర్ధారణలు చేసేయాలని ప్రయత్నిం^è వద్దు. అందుకు బదులు, ఆమె హత్యకు ప్రేరేపించిన, అనుమతించిన మరింత విస్తృత నేపథ్యంపై దృష్టిని కేంద్రీకరిద్దాం.



నోళ్లు మూస్తారా? లేకపోతే...

ఈ వైఖరి, ప్రత్యేకించి గౌరీ లంకేశ్‌ విషయంలో మరింత సందర్భోచితమైనది. ఆమె కేవలం ఒక వ్యక్తి కాదు. ఆమె ఒక భావానికి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఆమె హత్య ఆ భావాన్ని కడతేర్చాలని చేసిన ప్రయత్నమనే అనుకోవాలి. అంతే కాదు, నోళ్లు మూయండి లేదంటే చూస్కోండి అని మిగతా వాళ్లందరికీ సంకేతాన్ని పంపడమని కూడా అర్థం. ఈ సంకేతాలు బహిరంగంగా పంపినవి కాబట్టి, ఆమె హత్యకు దారి తీసిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి వాటి అంతరార్థాన్ని విప్పి చూడటం అవసరం.



‘ఎవరు చేశారు’ అనే దానికి సంబంధించి ఓ మాట. ఇంతవరకైతే, దీనికి సంబంధించి మనకు కొన్ని వాస్తవాలు తెలుసు. గౌరీ లంకేశ్‌ ఒక పాత్రికేయురాలు. లంకేశ్‌ పత్రికె అనే ఓ అసాధారణ పత్రికకు భయమెరుగని సంపాదకురాలు. తన సంపాదకత్వంలోని పత్రిక ద్వారా, కొము సౌహార్ద వేదికె వంటి సంస్థల ద్వారా బీజేపీ, దాని మిత్రపక్షాల హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆమె అవిశ్రాంత పోరాటాన్ని సాగిస్తున్నారు. గత ఏడాది ఒక బీజేపీ నేత ఆమెపై వేసిన పరువు నష్టం దావాలో ఆమె ఓడిపోయారు. ఆమె ఆ కేసులో చేసిన అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉంది. సంఘ్‌ పరివార్‌ అనుబంధ సంస్థల బెదింపులకు ఆమె పలుమార్లు గురయ్యారు. మనకు తెలిసినంత వరకు ఈ హత్యకు సంబంధించి వ్యక్తిగత కక్ష కోణం లేనే లేదు.



ఈ సమాచారం, ఆమెను చంపడానికి కారణం ఆమె భావాలు, తన ఆలోచనలను బహిరంగంగా వెల్లడించాలనే ఆమె సంకల్పమే అనే తార్కిక నిర్ధారణకు రావడానికి చక్కగా సరిపోతుంది. అయితే ఆమె హంతకులు, హత్య కుట్రదారులకు సంబంధించి ఈ సమాచారం కచ్చితమైన నిర్ధారణలకు చేర్చలేదు. అందువల్ల ఆ నేర పరిశోధనను చేయాల్సినది టీవీ స్టూడియోలలో ఎంత మాత్రమూ కాదు. అలా అని పోలీసులపై విశ్వాసం ఉంచాలని కాదు. కాంగ్రెస్‌ లేదా బీజేపీ ఏది అధికారంలో ఉన్నాగానీ ఇలాంటి కేసుల్లో పోలీసు దర్యాప్తు నిర్లక్ష్యపూరితమైనదిగా ఉంటున్న మాట నిజమే. అయినాగానీ మనం దర్యాప్తును ముందే కాదన కూడదు. అ తర్వాత మనం దానిపై నిశిత పరిశీలన జరపవచ్చు.


గౌరీ లంకేశ్‌ హత్యకు పథకం పన్నినది ఎవరో చెప్పే ఆధారాలు మనకు లేవుగానీ, ఆమె హత్యకు సంబరాలు చేసుకున్నవారు, దాన్ని సమర్థించినవారు ఎవరో చెప్పే ఆధారాలు బోలెడన్ని ఉన్నాయి. కొన్ని గంటల క్రితమే హత్యకు గురైన ఆ మహిళ గురించి వెక్కిరింతలు, తిట్లు, నిందలతో కూడిన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియా మోత మోగిపోయింది. వాటిలో చాలా వరకు బాగా సుపరిచితమైన బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యాతలవే. వారిలో కొందరిని ప్రధాన మంత్రి అంతటివారే ఫాలో అవుతున్నారు. ఈ హత్య సందర్భంగా, ఈ దుష్ప్రచార కార్యక్రమానికి, తమకు సంబంధం లేదని చెప్పుకోవడం అధికార పార్టీకి కీలకమైనది. కానీ, ఒక్క రవిశంకర ప్రసాద్‌ తప్ప మరే సీనియర్‌ బీజేపీ నేతా అలా నిర్ద్వంద్వంగా మాట్లాడింది లేదు. అసహ్యకరమైన వ్యాఖ్యానాలను చేస్తున్నవారిని ప్రధాని ఇంతవరకు ‘అన్‌ ఫాలో’ చేయలేదు.



సంఘ్‌ భావజాల ప్రత్యర్థుల వరస హత్యలు

లంకేశ్‌ హత్యకు ముందు జరిగిన మూడు హత్యలు ఇదే భయానకమైన పద్ధతిలో పునరావృతం అయ్యాయని కూడా మనకు తెలుసు. 2013లో జరిగిన హేతువాది డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌ హత్య, మూఢ నమ్మకాలను వ్యతిరేకించే మరో ఉద్యమకారుడు కామ్రేడ్‌ గోవింద్‌ పన్సారే హత్య, వాటిని వెన్నంటి 2016లో జరిగిన విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎం కల్బుర్గీ హత్య ఒకేవిధమైన పద్ధతిలో జరిగాయి. వీటిలో ప్రతి కేసులోనూ గుర్తు తెలియని హంతకులు సంఘ్‌ పరివార్‌ భావజాలానికి విరుద్ధమైన భావజాలాన్ని  గలిగిన నిర్విరామ మేధో యోధులను కాల్చి చంపారు. ఇవేవీ మరేదో హింసా చర్యకు ప్రతీకారంగా జరిగిన హత్యలు కావు.



రాజకీయ ప్రత్యర్థులను తుదముట్టించాలని చేసిన ప్రయత్నాలూ కావు. ఇవన్నీ ఒక భావాన్ని తుదముట్టించాలనే లక్ష్యంతో జరిగినవే. ఈ ముగ్గురు ‘హేతువాదులు’ ప్రచారం చేస్తున్నది ఏదో విపరీతపు ఆలోచన కాదు. ‘శాస్త్రీయ చింతన’ను పెంపొందింపజేయడం పూర్తిగా మన రాజ్యాంగబద్ధమైన ఆదర్శం. మన రాజ్యాంగానికి విరుద్ధమైన భావజాలం వారిని హత్య చేసింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తేనే, గౌరీ లంకేశ్‌ హత్య ఈ క్రమంలో సరిగ్గా ఇమిడి పోతుంది.



ఆమె భావాలు, మిగతా ముగ్గురి భావాలు ఒక్కటి కాని మాట నిజమే. కానీ, ఆమె మద్దతుదార్లు, ఆమెను నిందించేవారు అంతా కూడా ఆమెను ‘వామపక్షవాది’గా భావించారు. ఆమె నక్సలైట్‌ అనే బాధ్యతారహితమైన మాట సైతం కొంత వినిపించింది. ఇదేదీ వాస్తవం కాదు. కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ మేధో సంప్రదాయానికి గౌరి ప్రాతినిధ్యం వహించారు. అది ఈ వర్గాలు వేటిలోనూ ఇమిడేది కాదు. ‘గౌరీ లంకేశ్‌ పత్రికె’ సంపాదకురాలిగా ఆమె తన తండ్రి పీ లంకేశ్‌ వారసత్వాన్ని కొనసాగించారు.



ఆయన, కన్నడ సాహిత్యంలోని ‘నవ్య’ సాంప్రదాయానికి చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఒకరు. షిమోగాకు చెందిన ఈ ముగ్గురు రచయితలు, పీ లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి, యూఆర్‌ అనంతమూర్తి రామ్‌మనోహర్‌ లోహియా నుంచి ప్రేరణ పొందినవారు. దృÉý మైన కులవ్యతిరేక వైఖరిని సోషలిస్టు బ్రాండు రాజకీయాలు, సాంస్కృతికంగా వేళ్లూనుకుని ఉన్న లౌకికవాదాన్ని సమ్మిళితం చేశారు. తమ రచనలతో కర్ణాటకలోని ‘అభ్యుదయ’ కార్యకర్తలందరికీ ఉత్తేజాన్ని ఇచ్చిన దేవనార్‌ మహదేవ, సిద్ధలింగయ్య, డీఆర్‌ నాగరాజ్‌ వంటి తర్వాతి తరం కన్నడ మేధావులను వారు తీర్చిదిద్దారు.



పరివార్‌ను భయపెట్టే లంకేశ్‌ లౌకికవాదం

వారి సోషలిస్టు సాంప్రదాయం పేదలకు అనుకూలమైనది, సమానత్వవాదం అనే అర్థంలో ‘వామపక్షవాదం’. అయితే అది దాని సాంస్కృతిక ప్రాతిపదిక రీత్యా కమ్యూనిస్టు వామపక్షవాదం కంటే చాలా విభిన్నమైనది. ఈ సంప్రదాయం బసవన్న నాటి కాలం నుంచి వేళ్లూనికుని ఉన్న కన్నడ సమానత్వవాదంలో వేళ్లూనుకుని ఉన్నది. కొన్ని విషయాలలో గౌరి తమ తండ్రికంటే ఎక్కువగా సాంప్రదాయక వామపక్షవాది అయినా, ఆమె లౌకికవాదం మాత్రం ఈ సంప్రదాయపు కొనసాగింపే. తన తండ్రిలాగే ఆమె కూడా కన్నడంలోనే రాయాలని ఎంచుకున్నారు. సాంస్కృతికంగా వేళ్లూనుకున్న ఈ రూపంలోని లౌకికవాదం మన స్వాతంత్య్రోద్యమ కాలపు లౌకికవాద రూపానికి అనుగుణమైనది. ఈ సంప్రదాయం అంటేనే సంఘ్‌పరివార్‌ ఎక్కువగా భయపడుతుంది. ఈ రూపంలోని లౌకికవాదాన్ని ఈ నేలలో వేళ్లూనుకోనిదిగా, పాశ్చాత్య మేధోవాదంగా అది తోసిపారేయలేరు.



నేటి శివశక్తుల కలయికను ఆపే యత్నమా?

గౌరి పేరులోనే, హిందుత్వగా ఇప్పుడు మనకు అందిస్తున్నదానికి సవాలుంది. ఇది ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో దుర్గ, పార్వతి, భవానియర్‌గా కూడా పిలిచే ‘‘గౌరి’’ రాకను ఆహ్వానించే సమయం. ‘‘లంకేశ్‌’’ అంటేనే పరమ శివునికి పరమభక్తుడైన రావణుడు. గౌరీ లంకేశ్‌ పేరు శైవులలో ఉన్న రావణుని పూజించే సంప్రదాయాన్ని గుర్తుకుతెచ్చేదిగా  ఉంటుంది. ఆ ఆచారం, ఏకరూపపైన హిందుత్వ బృహత్‌ లక్ష్యాన్ని భగ్నం చేస్తుంది. అలాంటప్పుడు, శరద్‌ మాసానికి (తెలుగు ఆశ్వయుజ మాసం) సరిగ్గా ముందు ఆమెను హతమార్చడం ద్వారా హంతకులు... శక్తిగా మహిళ ప్రవేశంచడాన్ని, మన కాలపు శివపార్వతుల కలయికను నివారించాలనే మరింత పెద్ద ప్రాజెక్టులో అనుకోకుండానే భాగస్వాములయ్యారా?


గౌరీ లంకేశ్‌ భావమయ జీవితాన్ని గడిపారు. ఒక భావజాలం ఆమెను చంపడం అందుకు సరిగ్గా తగ్గట్టుగానే ఉంది. ఆ భావజాలం మన రాజ్యాంగానికి విరుద్ధమైనది, మన స్వాతంత్య్రోద్యమ విలువలను నిరాకరించేది, మన మేధో సాంప్రదాయలంటే భయపడేది, హిందూమతంలోని బహురూపాల శాఖలను తన అస్తిత్వానికి ముప్పుగా భావించేది. ఆమె మన కాలపు పాలక భావజాలం చేతిలో హత్యకు గురయ్యారు.



యోగేంద్ర యాదవ్‌

వ్యాసకర్త స్వరాజ్‌ ఇండియా అధ్యక్షులు, జైకిసాన్‌ సంస్థ సభ్యులు

మొబైల్‌ : 98688 88986




 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top