చెన్నపట్నం తొలి తెలుగు ‘వాణి’

చెన్నపట్నం తొలి తెలుగు ‘వాణి’ - Sakshi


మద్రాసు ఆకాశవాణి తెలుగువారి తొలినాటి రేడియో ప్రసారాలను వెలువరించిన కేంద్రం. తెలుగునాట సరళమైన వార్తా భాష స్థిరపడటానికి మద్రాసు ఆకాశవాణి కేంద్రం చేసిన కృషి ఎనలేనిది.

 

‘‘నేనిప్పుడు చెన్నపట్టణం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడి నుంచి వినుచున్నరో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వినుచున్నారని తలచుచున్నాను’’ అంటూ 1938 జూన్ 16 వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కుర్మా వెంకటరెడ్డి ‘భారతదేశం - రేడియో’ అనే అం శంపై ప్రసంగించారు. అది మద్రాసు రేడియో కేంద్రం మొదలైన రోజు. అవి అక్కడి నుంచి వినిపించిన తొలి తెలుగు పలుకులు. వెంకటరెడ్డి 1937 ఏప్రిల్ 1 నుంచి జూలై 14 దాకా నాటి మద్రాసు రాష్ట్ర ప్రధానిగా అంటే ముఖ్యమంత్రిగా పని చేసినవారు. త్యాగరాజుల వారి తెలుగు కృతిని వెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా ఈ కేంద్రం ప్రసారాలను ప్రారంభించింది. పిమ్మట అప్పటి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి ఆంగ్లంలో ప్రా రంభోపన్యాసం చేశారు. అప్పటికి ఆకాశవాణి అనే మాటను అధికారికంగా వాడ లేదు, రేడియోకు పర్యాయపదంగా వాడారు. రాజాజీ తన ఉపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రసార వాహికగా మద్రాసు రేడియో పుట్టుకతోనే తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అయితే తెలుగువాడైన సి.వి. కృష్ణస్వామిసెట్టి ప్రారంభించిన మద్రాసు ప్రెసిడెన్సీ క్లబ్ 1924 జూలై 31 నుంచి కొంత కాలం  ప్రసారాలను నిర్వహించింది. అది మూతపడ్డాక 1930లో మద్రాసు నగరపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కానీ అవీ ఎంతో కాలం సాగలేదు. ఇంతలో 1933లో హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో మహబూబ్ ఆలీ అనే తపాలా శాఖ ఉద్యోగి 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రం ప్రారంభించారు. 1935 నుంచి నిజాం నిర్వహణలోకి పోయిన ఆ కేంద్రం కార్యక్రమాలు ఉర్దూలో ఉండేవి. ఆ కేంద్రమే 1939 జూలై నుంచి దక్కన్ రేడియోగా మారింది. కనుక 1938 జూన్ 16వ తేదీని తెలుగు ఆకాశవాణి జన్మదినంగా పరిగణించాల్సి ఉంటుంది.

 మద్రాసు కేంద్రం నుంచి తెలుగు ప్రసారాలే ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతోంది. తొలి రోజులనాటి ఆ ప్రసారాలను గురించి ఆచంట జానకిరామ్ ఆత్మకథ ‘సాగుతున్నయాత్ర’లో కళాత్మకంగా, సవివ రంగా వర్ణించారు. ఆచంట జానకిరామ్, అయ్యగారి వీరభద్రరావు, సూరినారాయణమూర్తి మద్రాసు ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలకు చాలా దోహదం చేశారు. ఈ ముగ్గురిని ‘మూర్తి త్రయం’గా పేర్కొనేవారు. ఈ ముగ్గురు పాల్గొన్న ‘అనార్కలి’ తొలి తెలుగు రేడియో నాటకం. అది 1938 జూన్ 24న లైవ్‌గా మద్రాసు కేంద్రం ద్వారా ప్రసారమైందని డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ అంటారు. అనార్కలి పాత్రను భానుమతి చేశారు. నాటక రచయిత ‘వైతాళికులు’ ముద్దుకృష్ణ.  

 చారిత్రక విషయాల పరిశోధక రచయిత, నాటి ‘భారతి’ పత్రిక ఉపసంపాదకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ చేసిన‘మయ నాగరికత’ అనే ప్రసంగం రేడియో తెలుగు ఎలా ఉండాలో విశదం చేసింది. ‘‘ఈ యుగం ఎంత చిత్రమైనదో? ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోనూ పరిశోధనే! నిప్పు, నీరు, గాలి, ధూళి ఇం తెందుకు...’’ అనే వాక్యాలను పరిశీలిస్తే రేడియో వచన ధర్మాలు సులువుగా బోధపడతాయి. జానకిరామ్ ‘ఇతర గ్రహాలలో మానవులున్నారా?’ అనే అంశంపై జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా పేరుపొందిన సర్ వేపా రామేశముతో ప్రసంగం చే యించారు. కోలవెన్ను రామకోటేశ్వరరావు మద్రాసు ఆకాశవాణి నుంచి తొలి తెలుగు రేడియో పుస్తక సమీక్షను చేశారు. 1948 డిసెంబర్ 1న విజయవాడ కేంద్రం ప్రారంభమయ్యాక మద్రాసు తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. 1950 ఏప్రిల్ 1న నైజాం రేడియోను భారత ప్రభుత్వం స్వీకరించి, ఆకాశవాణిగా ప్రసారాలను కొనసాగించింది. 1963లో కడప, విశాఖపట్నం కేంద్రాలు మొదలయ్యాయి. పాతికేళ్ల క్రితం మరో ఎనిమిది జిల్లా స్థాయి రేడియో కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం మొదలైంది. నేటి వ్యాపార టీవీ చానళ్లు, ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో చానళ్ల ముందు ఆకాశవాణి వెలతెల పోతున్నట్టనిపించవచ్చు. కానీ టీవీ న్యూస్ చానళ్లు అరగంటలో ఇవ్వలేని వార్తా సమాచారాన్ని ఆకాశవాణి ఐదు నిమిషాల బులెటిన్‌లు ఇవ్వగలవు. సరళమైన వార్తా భాష స్థిరపడటానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. నాటి ప్రసారాల ఒరవడిని అనుసరిస్తే తెలుగు చానళ్లలో పరిశుభ్రమైన తెలుగు వినే భాగ్యం కలుగుతుంది.     జూన్ 16 ఆకాశవాణి మద్రాసు కేంద్రం 76వ జన్మదినం  (వ్యాసకర్త ‘ఆకాశవాణి’ ప్రయోక్త)  - నాగసురి వేణుగోపాల్

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top