30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్‌కు కోర్టు హెచ్చరిక | Madras Court Warn To Actor Vishal | Sakshi
Sakshi News home page

30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్‌కు కోర్టు హెచ్చరిక

Jun 5 2025 4:25 PM | Updated on Jun 5 2025 4:35 PM

Madras Court Warn To Actor Vishal

కోలీవుడ్‌ హీరో విశాల్‌,  ప్ర‌ముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)కు మధ్య కొన్నేళ్లుగా డబ్బు విషయంలో విభేదాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో విశాల్‌కు మద్రాస్‌ కోర్టు షాకిచ్చింది.  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. న్యాయపరమైన ఖర్చులతో సహా లైకా ప్రొడక్షన్స్‌ వారికి డబ్బు తిరిగి ఇవ్వాలని కోర్టు తెలిపింది.

సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని ఒప్పందం ప్రకారం ఎలాంటి సినిమా చేయలేదని  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ తెలిపింది. ఆపై డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో 2022 లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఆ సమయంలోనే లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని కోర్టు సూచించింది.  తన ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని  ఆదేశించింది. అంతవరకు ఆయన నటించి, నిర్మించిన ఎలాంటి సినిమాలు  థియేటర్స్‌,  ఓటీటీల్లో విడుదల చేయకూడదంటూ స్టే విధించింది. 

అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించార‌ని లైకా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆపై విశాల్‌ మీద కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఫైల్ చేసింది. దీంతో న్యాయస్థానం విశాల్‌ను మందలించింది. లైకాకు చెల్లించాల్సిన 21.29 కోట్ల రూపాయలను 30 శాతం వడ్డీ, న్యాయపరమైన ఖర్చులతో సహా చెల్లించాలని మద్రాస్ హైకోర్టు నటుడు విశాల్‌ను ఆదేశించింది. విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు దాఖలు చేశాడు. తన వద్ద 3 కార్లు, ఒక బైక్‌తో పాటు  రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించారు.  తన ఇంటిపై తీసుకున్న రుణానికి సంబంధించిన వివరాలను కూడా  ఆయన అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement