జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘననివాళి | Sakshi
Sakshi News home page

జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘననివాళి

Published Wed, May 30 2018 10:50 AM

Telugu states leaders pay floral tribute to Gandhi Memorial in Dallas - Sakshi

డల్లాస్‌, టెక్సాస్ : తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ ప్రముఖులు అమెరికాలోనే అతి పెద్దదైన డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించి జాతిపితకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. గతంలో ఓసారి డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్‌ను సందర్శించానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఏటా ఈ గాంధీ మెమోరియల్ ప్లాజా మెరుగులు దిద్దుకుంటూ అత్యంత సుందర ప్రదేశంగా వెలుగొందడం సంతోషదాయకమని తెలిపారు. ఖండాంతరాలల్లో జాతిపిత సిద్ధాంతాలను, ఆశయాలను సజీవంగా ఉట్టిపడేటట్లుగా ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడంలో కృషి చేసిన ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులకు, సిటీ అధికారులకు, స్థానిక ప్రజలకు అభినందలు తెలియజేశారు. తొలిసారిగా ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శిస్తున్నానని, ఇక్కడికి రాగానే శాంతిదూత గాంధీజీ ఆశయాలు, త్యాగ నిరతి, ప్రపంచంలో అనేకమంది యువకులకు స్ఫూర్తినిచ్చిన తీరు గుర్తుకొస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్ది రెడ్డి పేర్కొన్నారు. భావితరాలకు తప్పనిసరిగా ఇదొక స్ఫూర్తిదాయక ప్రాంతమౌతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ పార్కును అభివృద్ధి చేయడంలో సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు.

మహాత్మా గాంధీ మన భారతదేశంలో జన్మించినా, శాంతి స్నేహం, సుహృద్భావం, అహింస అనే అంశాలే ఆశయాలుగా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసి ప్రపంచంలో ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచిపోయారని గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాత్తూరి నాగభూషణం అన్నారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ పచ్చని చెట్లతో, చక్కని నీటి వనరులతో శాంతికి ప్రతిరూపంగా ఈ గాంధీ మెమోరియల్ ను అత్యంత సుందర పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దిన తీరు ను చూసి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు.  

తీరికలేని పనులతో బిజీ గా ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు నివాళులర్పించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలకు, స్థానిక ప్రముఖులైన వెంకట్ అబ్బూరు, మురళి
వెన్నం, వినోద్ ఉప్పు తదితరులందరికీ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. 

Advertisement
Advertisement