సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు

Siliconandhra Annamayya 611 Anniversary celebrations held in California - Sakshi

కాలిఫోర్నియా : సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాలు మిల్పిటాస్‌లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో 3రోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 1000మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమంలో వివిధ నగరాలనుండి వచ్చిన వందలాది కళాకారులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమానికి ప్రియ తనుగుల, మమత కూచిభొట్ల, వాణి గుండ్లపల్లి నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి చేతులమీదుగా సుజనరంజని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది. ఈ సంచికలో ప్రముఖ రచయితలు అన్నమయ్య కీర్తనల గురించి వ్రాసిన అమూల్యమైన రచనలు పొందుపరిచారు. 

సిలికానాంధ్ర వాగ్గేయకార బృందం నేతృత్వంలో రెండవరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన అన్నమయ్య సంగీత పోటీలు 3వరోజు జరిగిన నృత్య పోటీలతో పాటు 3 రోజులు సాయంత్రం వేళల్లో ఏర్పాటు చేసిన ప్రముఖ కళాకారులు గరిమెళ్ల అనిల్ కుమార్, శ్రీలక్ష్మి కోలవెన్ను, గాయత్రి అవ్వారి, జోశ్యుల సూర్యనారయణ, హలీం ఖాన్‌లతో సంగీత నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను తన్మయులను చేశాయి. ఈ 3 రోజుల ఉత్సవాలలో దాదాపు 2000 మందికి పైగా ప్రేక్షకులు పాల్గొని అన్నమయ్యకు స్వర నివాళి అందించారు.  ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ 611 సంవత్సరాల క్రితం అన్నమయ్య రచించిన ఈ కీర్తనలు  పదికాలాలు పదిలంగా ఉంచడానికి, తరువాతి తరాలకు అందించడానికే సిలికానాంధ్ర అన్నమయ్య జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా అమెరికా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు లక్ష అరవైవేలమందితో అన్నమయ్య లక్షగళార్చన, సహస్రగళ సంకీర్తనార్చన, నిర్విరామంగా 108 గంటలపాటు అన్నమయ్య 444 కీర్తనల ఆలాపన వంటి కార్యక్రమాలు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలో అమెరికాలో 18 వేలమందితో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  సిలికానాంధ్ర వాగ్గేయకార బృందం అధ్యక్షులు సంజీవ్ తనుగుల నేతృత్వంలో వంశీ నాదెళ్ల, దుర్గ దేవరకొండ, చంద్రిక తాడూరి, మృత్యుంజయుడు తాటిపాముల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, సాయి కందుల, ఫణి మాధవ్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top