నాట్స్ ఆధ్వర్యంలో కోటి రాగాలు

NATS Conduct Koti Musical Night In Kansas - Sakshi

కోటి  మ్యూజికల్ నైట్ లో చిందేసిన తెలుగు ప్రజలు

క్యాన్సస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. క్యాన్సస్ లో కోటి రాగాలు పేరుతో మ్యూజికల్ నైట్ నిర్వహించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగువారి కోసం నాట్స్ ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసింది. తెలుగు ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ మ్యూజికల్ నైట్‌లో తన పాటలతో హోరెత్తించారు. తెలుగువారి చేత చిందేయించారు. మాస్, క్లాస్ బీట్ సాంగ్స్ తో కోటి టీం పాటల ప్రవాహాన్ని కొనసాగించడంతో తెలుగువారికి మధురానుభూతులు పంచింది. చాలా కాలం తర్వాత తెలుగు పాటల ప్రవాహంలో మునిగితేలామని.. అలనాటి రోజులను గుర్తు చేసుకున్నామని క్యాన్సస్ లో ఉండే తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

క్యాన్సస్ నాట్స్ ఛాప్టర్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి,  సెక్రటరీ వెంకట్ మంత్రి నేతృత్వంలో చేపట్టిన ఈ మ్యూజికల్ నైట్ ఎంతో ఆహ్లాదంగా సాగింది. ఈ సందర్భంగా నాట్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడి మాట్లాడుతూ.. నాట్స్‌ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగువారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
 
నాట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల గురించి  మంచికలపూడి వివరించారు. అమెరికాలో ఉండే తెలుగువారంతా ఇప్పుడు నాట్స్ కుటుంబంలో చేరుతున్నారని... నాట్స్ కుటుంబం అంటే ఒకరికి ఒకరు అండగా ఉండే కుటుంబం..అమెరికాలో  తెలుగువారికి ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించే కుటుంబం అనేది నాట్స్ హెల్ప్ లైన్ రుజువు చేసిందన్నారు. కోటి రాగాల కార్యక్రమం అనంతరం  సంగీత దర్శకుడు కోటితో పాటు మిగిలిన గాయనీ, గాయకులు సుమంగళి, శ్రీకాంత్ సండుగు, ప్రసాద్ సింహాద్రి తదితరులను నాట్స్ ఘనంగా సత్కరించింది. దాదాపు  500 మందికిపై తెలుగువారు కోటి రాగాలు కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు పాటల మాధుర్యంలో తేలియాడారు. క్యాన్సస్ తెలంగాణ కల్చరల్ అసోషియేషన్ ఈ మ్యూజికల్ నైట్ కు కో స్పాన్సర్ గా వ్యవహారించింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top