ఇదే నా పల్లెటూరు అంటున్న చికాగో ఆంధ్ర సంఘం..

Cultural Programmes Conducted By Chicago Andhra Association - Sakshi

చికాగో: ఇదే నా పల్లెటూరు అంటూ హరివిల్లు ముగ్గులు పెట్టి, గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు అని పాటలు పాడుతూ చలి మంటల వెలుగులో కళకళలాడుతున్నాయి. మన తెలుగింటి ఆడపడుచులు చేసిన ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, పిల్లల పల్లె పాటల నృత్యాలు, ఘుమ ఘుమలాడే పిండి వంటలు, బండ్లపై ధాన్యపు రాశులు, ఎడ్ల పోటీలు, కోడి పందాలు, చలాకీగా ఎగిరిన గాలి పటాలు, పల్లె సంబరాలివన్నీ. ఇదంతా మన ఆంధ్రలో కాకుండా ఏడు సముద్రాలు దాటి మన తెలుగు కుటుంబాలు సరదాగా చికాగోలో జరుపుకున్న వేడుకలు. చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఉల్లాసంగా ఏర్పాటు చేసిన పల్లె సంబరాలు అంబరాన్ని అంటాయి.
 
ప్రెసిడెంట్ భార్గవి నెట్టం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 280 మందికి పైగా పిల్లలు, పెద్దలు సమర్పించిన 35 సాంస్కృతిక కార్యక్రమాలకు వేయిమందికి పైగా అతిథులు పాల్గొన్నారు. బోలింగ్ బ్రూక్ హైస్కూల్ లో ఈ కార్యక్రమ వేదిక అలంకరణలను కిరణ్ మట్టె, పవిత్ర కారుమురి, ప్రవేశ ద్వారం వద్ద అలంకరణలను రాజ్ మునగా దంపతులు, జయశ్రీ సోమిశెట్టి అందించి మొత్తం ప్రాంగణానికి నూతన శోభను చేకూర్చి ప్రశంసలను అందుకున్నారు. నీలిమ బొడ్డు, సునీత రాచపల్లి, మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి, అర్చిత దామరాజు సాంప్రదాయ పద్దతిలో పన్నీరు చల్లుతూ ఆహూతులను ఆహ్వానించారు.


చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మంది పైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సమత పెద్దమారు, పావని కొత్తపల్లి, శ్వేత కొత్తపల్లి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య రీతులతో పాటు అందరినీ అలరించడానికి విభిన్నమైన సినీ సంగీత కార్యక్రమాలను రూపొందించారు. గురు జానకి ఆనందవల్లి శిష్యుల పూర్వాంగం, గురు అపర్ణ ప్రశాంత్ శిష్యుల మండూక శబ్దం కూచిపూడి నృత్యాలు అందర్నీ అలరించాయి.

మాటపాటలతో అదరగొట్టిన వ్యాఖ్యాతలు
గురు జ్యోతి వంగర దర్శకత్వంలో పల్లెపదం నృత్యరూపకం ఆంధ్ర పల్లె జీవితాన్ని అమెరికాలో ప్రస్ఫుటింపజేసి అందరి ఆదరణ చూరగొంది. సాహితి ఆదిమూలం, పద్మాకర్ దామరాజు, సవిత యాలమూరి-వెర్నేకర్ వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కోశాధికారి గౌరి శంకర్ అద్దంకి, మాలతి దామరాజు, రామకృష్ణ తాడేపల్లి, అనురాధ గంపాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, కిరణ్మయి వంకాయలపాటి, సురేశ్ శనక్కాయల, నాగరమేశ్ నెక్కంటి, శ్యామ పప్పు తదితరులు సమర్ధవంతంగా నిర్వహించారు.

సభ్యులు జమ చేసే వార్షిక సభ్యత్వ రుసుములో పాతిక శాతం సంస్థ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చికాగోలోనే కాక అమెరికా దేశంలోని తెలుగు సంఘాలలో ప్రథమమని ప్రెసిడెంట్ భార్గవి నెట్టం, కార్యదర్శి రాజ్ పోట్లూరి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఈడీ వాణి దిట్టకవి గారు తెలిపారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ..గత ఏడాది అంధ్ర రాష్ట్రంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అందించడమే సీఏఏ లక్ష్యమని వ్యవస్థాపక చైర్మన్‌ సుందర్ దిట్టకవి పెర్కొన్నారు.
 
ఆహా ఏమి రుచి
అంతే కాకుండా చికాగో ఆంధ్ర సంఘం వారు ఏటా తెలుగు రుచులను ఇక్కడి వారికి పరిచయం చేస్తున్నట్లు, విజయ్ కొర్రపాటి నేతృత్వంలో ఈ ఏడాది కూడా సాంప్రదాయబద్ధమైన తెలుగు విందును అందించారు. సంఘ సహ వ్యవస్థాపకులు పద్మారావు- సుజాత అప్పలనేని, శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, రాఘవ-శివబాల జాట్ల, సుందర్-వాణి దిట్టకవి, దినకర్-పవిత్ర కరుమూరి, ప్రసాద్-భార్గవి నెట్టెం, ఉమ కటికి, సంధ్య అప్పలనేని, కార్యవర్గ సభ్యులు శ్రుతి మోత్కూర్, మురళి రెడ్డివారి, శ్రీ హరి జాస్తి, విజయ్ కొర్రపాటి, విష్ణువర్ధన్ పెద్దమారు, సురేష్ పోనిపిరెడ్డి, సత్య నెక్కంటి, సాయి రవి సూరిభోట్ల, సురేష్ ఐనపూడి, రమేష్ తాంగుడు, సతీష్ దేవేళ్ళ, కార్యకర్తలు అతిథులకు కొసరి వడ్డిస్తూ భోజన ఏర్పాట్లను నిర్వహించారు. వందన సమర్పణ, భారత జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top