పరోక్ష  ఓటింగ్‌ బిల్లుకు పూర్తి మద్దతు : కుంతియా

Congress party supports NRI proxy voting Bill says kunthiya - Sakshi

ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రామ్‌ చంద్ర కుంతియా

సాక్షి, సిటీబ్యూరో : సర్వీస్‌ ఓటరు తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ సదుపాయం కల్పించే బిల్లుకు రాజ్యసభలో పూర్తి మద్దతు ఇస్తామని ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రామ్‌ చంద్ర కుంతియా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఎమిగ్రంట్స్‌ వెల్పేర్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘ఎన్నారైలకు ప్రాక్సీ ఓటింగ్‌– ఎన్నికల్లో గల్ఫ్‌ ప్రవాసుల ప్రభావం’ అంశంపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రాతినిధ్యం సవరణ బిల్లు–2017ను పార్లమెంట్‌ ఆమోదించగా, రాజ్యసభలో ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే సుమారు కోటిన్నర మంది ప్రవాస భారతీయలు ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుదని చెప్పారు. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు గుర్తింపుతోపాటు సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

ఎమిగ్రంట్స్‌ వెల్పేర్‌ ఫోరం అధ్యక్షుడు ఎం బీమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు మాసాలు స్థానికంగా లేకుంటే ఓటు హక్కు తొలగిస్తున్నారని, ప్రవాస భారతీయులకు ఓటు హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం కోటిన్నర మంది ప్రవాస భారతీయులుంటే  25 వేలమంది కూడా ఓటర్లుగా నమోదు కాలేదని, తెలంగాణకు చెందిన 15 లక్షల మందికి గాను 1500 మంది కూడా ఓటరుగా నమోదు కాలేదని గుర్తు చేశారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటరుగా నమోదైతే తెలంగాణలోని 25 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో  ప్రవాస భారతీయులు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదన్నారు. రాజకీయ పార్టీలు ప్రవాస భారతీయులకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో ప్రవాస భారతీయుల ప్రతినిధులు డాక్టర్‌ వినోద్‌ కుమార్, దేవేందర్‌రెడ్డి,  అసీమ్‌ రాయ్, అజీజ్‌ , లిస్సీ డాక్టర్‌ రఘు, ప్రొఫెసర్‌ అడప సత్యనారాయణ, సురేష్‌ రెడ్డి, బసంత్‌రెడ్డి  ఉపాస, హేమంత్, కేఎస్‌ రామ్, రేణుక శాంతిప్రియ, డీపీ రెడ్డి, భవానిరెడ్డి, బండ సురేందర్‌ తదితర సదస్సులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top