ఆటా, టాటా వేడుకల్లో మహానేత వైఎస్సార్‌కు ఘననివాళి

ATC Pay Rich TRibute To YS Rajasekhara Reddy In Dallas - Sakshi

డల్లాస్‌ : ఏటీసీ తెలుగు మహాసభ ఉత్సవాలు మూడు రోజులు పాటు(మే31-జూన్‌2) డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల చివరి రోజైన శనివారం నాడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఏటీసీ ప్రతినిధులు ఘననివాళి ఆర్పించారు. ఆయన జ్ఞాపకార్థం ‘సెలబ్రేటింగ్‌ డాక్టర్‌ వైఎస్సార్‌ లైఫ్‌ అండ్‌ లెగసీ’  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు వైఎస్సార్‌తో వారి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

వైఎస్సార్‌ చిరకాల మిత్రుడు ప్రేమసాగర రెడ్డి మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఆహుతులతో పంచుకున్నారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ప్రతి సందర్భంలో ఆయన లేకపోవటం కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(టాటా) అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ మల్లారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ జీవితాంతం గుర్తుపెట్టుకునే మహామనిషి అన్నారు. సాయం కోసం  వైఎస్సార్‌ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని.. ఆయన మనస్సున్న మహారాజని గుర్తుచేశారు.

పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ తనను హిందీ అకాడమీకి చైర్మన్‌గా నియమించటమే కాకుండా, అఖరి వరకు తనకు చేదోడువాదోడుగా నిలిచారని వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

అమెరికన్‌ తెలుగు అసోషియేషన్(ఆటా) అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన నిజమైన నాయకుడు వైఎస్సార్‌ అని అన్నారు. ఆయన స్నేహనికి ప్రాణమిచ్చే అరుదైన వ్యక్తి అని కొనియాడారు.

ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కుటుంబంతో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ కుటుంబానికి మైలవరంతో ఉన్న అనుబంధాన్ని  ఆయన ఆహుతులకు తెలియజేశారు.

ఇతర వక్తలు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ మరణం ఇప్పటికి ఓ పీడకలలా వెంటాడుతుందన్నారు. ఆయన మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిత్యం ప్రజల కోసం పోరాడుతూ తన తండ్రిని గుర్తుకు తెస్తున్నారని.. వైఎస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడు అవ్వాలని ఆకాంక్షించారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన మంచి మంచి పథకాలను పూర్తి చేయగల సత్తా కేవలం వైఎస్‌ జగన్‌కే ఉందన్నారు. ప్రజలు వైఎస్‌ జగన్‌కి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎంఎస్‌ రెడ్డి, రవి సన్నారెడ్డి, వైఎస్సార్‌ చిరకాల మిత్రులు రాఘవ రెడ్డి, డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, నిజామాబాద్‌ మాజీ ఎంపీ ఆత్మచరణ్‌ రెడ్డి, పరమేష్‌ భీంరెడ్డి, డా. మోహన్‌ మల్లం, డా.హరినాథ్‌ పొలిచర్ల, రాజేశ్వరరెడ్డి గంగసాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అమెరికా కన్వీనర్లు డా.శ్రీధర్‌ కొర్సపాటి, డా. వాసుదేవతో పాటు అమెరికా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటానికి సహకరించిన హరిప్రసాద్‌ లింగాలకి కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top