డాలస్‌లో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'

5th International Yoga Day at Gandhi Memorial - Sakshi

డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగాను, కాన్సుల్ రాకేష్ బనాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సంస్థ కార్యదర్శి రావు కల్వల అతిథులకు స్వాగతం పలికి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సంస్థ ఉపాధ్యక్షుడు బి.ఎన్ రావుమాట్లాడుతూ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రధాన వేధిక కావడం సంతోషంగా ఉందన్నారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగా అనే  ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక అన్నారు. యోగా చేయడానికి వయస్సు, జాతి, మతం, కులం అడ్డు కావని అందుకే 170 దేశాలకు పైగా కోట్లాది ప్రజలు జూన్21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని అన్నారు. యోగా  సంవత్సరానికి  ఒక సారి వచ్చే పండుగలా కాకుండా దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు. ఈ యోగాను ఇర్వింగ్ నగరంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఇర్వింగ్ మేయర్‌కు సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో దేశాల ప్రజలు యోగాను తమ జీవితాలలో ఒక ముఖ్య భాగంగా చేసుకోవడం విశేషమని, యోగాను ఆవిష్కరించిన భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాన్సుల్ రాకేష్ బనాటి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించటంతో ప్రపంచవ్యాప్తంగా యోగా జరువుకోవడం భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డాలస్ విద్యార్థులకు మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ 2,000 డాల్లర్ల స్కాలర్షిప్‌ను యూనివర్సిటీ ఏషియా సెంటర్ డైరెక్టర్  మోనిక్ వేడేర్బర్న్ కు మేయర్ చేతుల మీదుగా అందజేశారు. 

“92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో” విజేతలుగా నిలిచిన  అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను, వారి తల్లిదండ్రులను డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు, మేయర్ రిక్ స్టొఫర్, కాన్సుల్ రాకేష్ బనాటిలు ఘనంగా సత్కరించారు. దాదాపు రెండు గంటల పాటు యోగా గురువులు విజయ్, పెగ్గీ నేతృత్వంలో యోగాలోని మెళకువలను ఉత్సాహంగా ప్రవాస భారతీయులు నేర్చుకొని సాధన చేశారు. సంస్థ కోశాధికారి అభిజిత్ రాయిల్కర్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులకు, విచ్చేసిన అతిధులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన వారికి, వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేసిన సరిగమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన వారందరికీ గాంధీ మెమోరియల్ సంస్థ వారు యోగ్యతా పత్రాలను, అల్పాహారం అందజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top