అతడు తన దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. ఆందోళనకారుల దాడిలో వివేక్ చేతిలో ఉన్న డ్రిల్ మెషీన్ అతని తల్లోకి దిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు... వ్యతిరేకిస్తున్న వారు... మంగళవారం కూడా రెచ్చిపోయారు. రెండు వర్గాలూ పెట్రేగిపోయి అవతలివర్గం తాలూకు దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని తగలబెట్టేయడంతో  స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ్మేసింది. ఈనేపథ్యంలో తాజాగా బయటికొచ్చిన ఓ ఎక్స్‌రే రిపోర్టు ఆందోళనకారుల వెర్రి చేష్టలను కళ్లకు కడుతోంది.  ఎక్స్‌రే ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో చోటుచేసుకున్న సీఏఏ ఘర్షణల్లో వివేక్ అనే వ్యక్తి తల్లోకి డ్రిల్లింగ్ మెషీన్ చొచ్చుకెళ్లింది. అతడు తన దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. ఆందోళనకారుల దాడిలో వివేక్ చేతిలో ఉన్న డ్రిల్ మెషీన్ అతని తల్లోకి దిగింది.
(చదవండి: ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ)
దీంతో అతన్ని హుటాహుటిన జీటీబీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ఫొటోను పాయల్ మెహతా అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. అయితే, బాధితుడి గాయం వద్ద ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకపోవడం..ఎక్స్‌రేలో ఒక చోట ఫిబ్రవరి 25, 2020 అని ఉన్నప్పటికీ.. మరో చోట మార్చి 23, 2020 అని ఉండటంతో సందేహాలకు తావిచ్చింది. కాగా, ఢిల్లీలో అల్లరి మూకలు మారణాయుధాలతో వీధుల్లో స్వేచ్ఛగా స్వైరవిహారం చేశాయి. ఈ ఘర్షణల్లో సోమవారం 5 మంది, మంగళవారం మరో 8 మంది బలైపోయారు. మరో 200 మంది వరకూ గాయపడగా... వారిలో 48 మంది పోలీసులే కావడం గమనార్హం!
(చదవండి: కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
