‘క్రూరంగా పశువులా ప్రవర్తించాడు.. అందుకే’

Women MeToo Story On Humans Of Bombay Page Says May Inspire A Lot - Sakshi

ఇప్పుడే ఎందుకంటే...

హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజీలో ఓ యువతి రాసుకొచ్చిన పోస్టును ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటే..మరికొంత మంది మాత్రం ఎప్పటిలాగానే ఇప్పుడెందుకు.. అప్పుడేం చేశావు... నీకు నచ్చలేదు.. బాధ కలిగింది కాబట్టే ఇప్పుడు అతడి గురించి బయటపెట్టావా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ నెగటివ్‌ కామెంట్స్‌ చదువుతుంటే విషయమేంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్టే. గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింస, వేధింపుల గురించి శ్రుతీ చౌదరి అనే అమ్మాయి నిర్భయంగా అందరితో పంచుకుంది. అంతేకాదు తన #మీటూస్టోరీ ఎంతో మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుందని ధైర్యంగా ‘అతడి’ ముసుగును తొలగించింది. తనలా ఎవరూ మోసపోకూడదని.. అతడి బారి నుంచి కనీసం ఒక్కరిని కాపాడినా సరే తను విజయం సాధించినట్లేనని పేర్కొంది.

ఆ పోస్టు సారాంశం ఇలా..
 ‘అందరిలాగానే కలలు సాకారం చేసుకునేందుకు... చిన్న పట్టణం నుంచి ముంబై మహానగరానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే ఎన్నెన్నో సత్యాలు నాకు బోధపడ్డాయి. ఓరోజు నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఓ వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. సోషల్‌ మీడియాలో నా రాతలు చూసి తన దగ్గర రైటర్‌గా పనిచేయాలంటూ కోరాడు. సరే అన్నాను. కలిసి పనిచేస్తున్న క్రమంలో మా మధ్య స్నేహం చాలా బలపడింది. ఆత్మీయుడిగా భావించి నాకున్న అభద్రతా భావం గురించి, ఇతర సమస్యల గురించి అతడితో పంచుకోవడం ప్రారంభించాను. తరుచుగా కలుసుకునేవాళ్లం(అన్ని విధాలుగా). అయితే మా స్కాట్లాంట్‌ ట్రిప్‌ వరకు అంతా బాగానే జరిగింది. ఆరోజు రాత్రి మేము ఔటింగ్‌కు వెళ్లాల్సింది. కానీ అకస్మాత్తుగా వద్దన్నాడు. అయితే నేను అందుకు సిద్ధంగా లేనని చెప్పాను. కాసేపటి తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాతో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడటం మానేశాడు. దాంతో గిల్టీగా ఫీలయ్యాను. తన కోరిక కాదన్నందుకు బాధపడతాడేమోనని సరేనన్నాను. కానీ తను మాత్రం అలా అనుకోలేదు. చాలా కఠినంగా, పశువులా ప్రవర్తించాడు. ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కదా అన్నా వినలేదు. శారీరక హింసకు గురిచేశాడు. అలా చాలాసార్లు ఎంతగానో హింసించాడు. కొన్ని రోజుల తర్వాత తనతో ‘బంధం’ తెంచుకోవాలని అనుకున్నాను. తను కూడా సరేనన్నాడు. సహచర ఉద్యోగుల్లా మాత్రమే ఉన్నాము.

కానీ ఓ రోజు నాకు వచ్చిన మెసేజ్‌ చూసి షాకయ్యాను. అతడు కేవలం నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు అని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. అతడి నిజస్వరూపం గురించి బయటపెట్టాలని భావించాను. నాలా ఎంతమంది అమ్మాయిలు ఈ లైంగిక హింసను ప్రేమలో భాగం అనుకుని పొరబడ్డారో తెలిసి, నా మూర్ఖత్వం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నా మీటూస్టోరీని బహిర్గతం చేశాను. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి.. మళ్లీ ఆన్‌ చేయగానే నా పోస్టు వైరల్‌గా మారడం చూసి ఆశ్చర్యపోయాను. పదుల కొద్ది సంఖ్యలో అమ్మాయిలు అతడిని నమ్మిన తీరు, ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా అతడెంతో క్రూరుడు. మూర్ఖుడు. నేను ధైర్యంగా అతడి గురించి బయటపెట్టడం చూసి చాలా మంది కూడా పోరాడటానికి సిద్ధమయ్యారు. అందుకు ఫలితంగా అతడికి శిక్ష వేయించడంలో సఫలీకృతులమయ్యాం. ఈ రోజు నేను షేర్‌ చేసిన నా స్టోరీ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందనుకుంటున్నాను. నాలా ఎంతో మంది భ్రమలో ఉండి మోసపోయి ఉంటారు. మీరెవ్వరూ ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకురావాలి.

ఇప్పుడెందుకంటే...
హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీలో ‘ట్రిగ్గర్‌ వార్నింగ్‌’ పేరిట రాసుకొచ్చిన శ్రుతి చౌదరి మీటూస్టోరీ 24 గంటల్లోపే వేల కొద్దీ లైకులు, షేర్లతో దూసుకుపోయింది. ‘ హ్యాట్సాఫ్‌!!! మీలా ధైర్యంగా ముందుకు రాకపోవడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇలా చెప్పడం ద్వారా మీరు కనీసం ఒక్కరినైనా అతడి నుంచి రక్షించిన వారవుతారు. అలాకాకుండా నాకెందుకులే అనుకుని ఉంటే మరెంతో మంది అతడి బారిన పడేవారు. మీరు చాలా ధైర్యవంతురాలు’ అంటూ వందల సంఖ్యలో పురుషులు, మహిళలు శ్రుతికి మద్దుతగా నిలుస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వివాహిత మాత్రం.. ‘ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నా భర్త నిజస్వరూపం గురించి బయటపెట్టాలని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయా. అది నిజంగా ఎంతపెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు’ అని తన బాధను వ్యక్తపరిచారు. ‘ జెంటిల్‌మేన్‌ ఎప్పుడూ సమ్మతం లేకుండా ఏ మహిళను కనీసం తాకరు. నిజంగా జెంటిల్‌మేన్‌ అయితే భార్య అయినా గర్ల్‌ఫ్రెండ్‌ అయినా సరే వారి నిర్ణయాన్ని తప్పక గౌరవిస్తాడు’ అంటూ దేవ్‌ పత్‌ అనే ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు హ్యూమన్స్‌ బాంబేతో పాటు నెటిజన్లు కూడా పాజిటివ్‌గా రియాక్టవ్వడం విశేషం. ఇది నాణేనికి ఒకవైపు.

ఇప్పుడెందుకో.. మీ తప్పేం లేదా?
ఎవరైనా ఒక అమ్మాయి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పగానే ఎదురయ్యే మొదటి, అతి సాధారణ ప్రశ్న. ఇప్పుడెందుకు ? అప్పుడేం చేశావు? అవును శ్రుతి చౌదరి చెప్పినట్టుగా ఎంతోమంది భ్రమలో పడి మోసానికి గురవుతున్నారు. తీరా ఆ విషయం గుర్తించే సరికి సమయం మించిపోవడంతో.. ఇలాంటి నెగటివిటీకి, సోకాల్డ్‌ పరువుకు భయపడి నోరు విప్పి నిజాలు చెప్పడం లేదు. చెబితే అప్పుడు అనుభవించిన శారీరక హింసకంటే కూడా... తనకు ఎదురవ్వబోయే మానసిక హింసను భరించడమెలాగో తెలియని భయం. ఎందుకంటే లైంగిక హింసకు గురైంది ఒక మహిళ అయితే, అత్యాచారానికి గురైంది ఓ ఆడపిల్ల అయితే సమాజం ఎప్పుడూ ఆమెను బాధితురాలిగా గుర్తించే కంటే.. ఏదో తప్పు చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి ఆమెను మరింతగా కుంగదీసేందుకే ప్రయత్నిస్తోందనే భయం. కానీ శ్రుతి ఇలాంటివి చిన్న చిన్న విషయాలంటూ తేలికగా తీసుకుంది. అందరూ ఆమెలాగే ముందుకు వస్తే.. పశ్చాత్తాపం కంటే కూడా భయంతోనైనా అతడి లాంటి మేకతోలు వన్నె పులులు కాస్తైనా మారతాయనేది ఆమె ఉద్దేశం. ఒక్క శ్రుతిదే కాదు... భారత్‌లో మీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టిన బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా, దక్షిణాదిన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న చిన్మయి శ్రీపాద వంటి వారి ఉద్దేశం కూడా ఇదేననేది మెజారిటీ వర్గాల అభిప్రాయం.

వాళ్లే కదా జెంటిల్‌మెన్‌..
శ్రుతి పోస్టు ద్వారా చర్చనీయాంశంగా మారిన మరో అంశం వైవాహిక అత్యాచారం(మ్యారిటల్‌ రేప్‌). వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్‌ రేప్‌ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్‌ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్‌ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది.

‘రేప్‌ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో  పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం  డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్‌ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక​ చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్‌ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్‌ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్‌ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్‌ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. . మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అభిప్రాయాన్ని.... రేప్‌ నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్న విషయాన్ని గౌరవించాలంటున్నారు. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యతను ప్రతీ ఒక్కరు గుర్తించాలంటున్నారు.

న్యాయం జరుగుతుంది కదా!!
‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్‌ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినపుడే న్యాయం జరుగుతుంది కదా’ - గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, యూరోప్‌ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్‌ చేసిన వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top