తమిళనాడుకు మహిళా గవర్నర్?

తమిళనాడుకు మహిళా గవర్నర్? - Sakshi


- విద్యాసాగర్‌రావుకు పనిభారం

- పరిశీలనలో ఆనందీబెన్, నజ్మాహెప్తుల్లా

- రెండు రోజుల్లో కేంద్రం ప్రకటన?

 

 సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నరుగా బీజేపీ సీనియర్ మహిళా నేతలు నజ్మాహెప్తుల్లా, అనందిబెన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రోశయ్య పదవీ కాలం ఆగస్టు 31తో ముగిసింది. సహజంగా గవర్నర్ల పదవీకాలం ముగిసేలోపే కొత్త వారిని ఖరారు చేస్తారు. కర్ణాటక శాసన మండలి చైర్మన్ శంకరమూర్తి పేరును కేంద్రం దాదాపు ఖరారు చేసింది. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ వివాదం రగులుతున్న తరుణంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని గవర్నర్‌గా నియమించడం అగ్నిలో ఆజ్యం పోసినట్లేనని భావించి కేంద్రం వెనక్కు తగ్గింది.



దీంతో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావును గత నెలలో ఇన్‌చార్జ్‌గా నియమించింది. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికి త్స పొందుతుండటం, ఇప్పట్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేకపోవడంతో గవర్నర్ బాధ్యతలు కీలకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, సీనియర్ మంత్రులు పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని పరిస్థితిని గవర్నర్ సమీక్షించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి నిర్వర్తిస్తున్న ప్రభుత్వ శాఖలను పన్నీర్‌సెల్వంకు అప్పగించడం వంటి కీలక నిర్ణయాలను విద్యాసాగర్‌రావు ఇన్‌చార్జ్ గవర్నర్ హోదాలోనే తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి.



మహారాష్ట్ర, తమిళనాడుల మధ్య తిరుగుతూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న గవర్నర్ విద్యాసాగర్‌రావు జయ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎక్కువరోజులు తమిళనాడులోనే గడపాల్సి వస్తోంది. దీంతో తమిళనాడుకు శాశ్వత గవర్నర్‌ను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్, మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా పేర్లను పరిశీలిస్తున్నట్లు  సమాచారం. ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్నందున త్వరలోనే గవర్నర్ నియామకంపై ఒక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top