
మన రాజ్యాంగం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది. రాజకీయ వర్గాలకు, ప్రతికూలమైన తీర్పులను ఎత్తి చూపడానికి ఒక సాధనం కావచ్చు. న్యాయ వ్యవస్థకు మాత్రం ఇదొక వేగుచుక్క. చట్టపర మైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేదే ఆర్టికల్ 143. తాజాగా బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నలు వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయసలహా కోరి దీన్ని ఉపయోగించారు.
సాధారణ సందర్భాల్లో ఇది వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్నలు తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పిన అంశాలనే తిరిగి పరిశీలించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రాష్ట్రపతి కోరుతున్న న్యాయ సలహా అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ చర్యా లేదా సుప్రీం తీర్పును దొడ్డిదారిలో సమీక్షించే ప్రయత్నమా?
కోర్టు సమాధానం చెప్పనక్కర్లేదు!
ఇటీవల తమిళనాడు కేసు విషయంలో– మంత్రి మండలి సహాయం, సలహా ప్రకారమే గవర్నర్ పనిచేయాలనీ, బిల్లులను ఆమోదించే ప్రక్రియలో నిరవధికంగా ఆలస్యం చేయలేరనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతితో సహా రాజ్యాంగ అధికారులు జవాబుదారీతనం లేకుండా లేదా కాలపరిమితిని దాటి వ్యవహరించలేరని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు ఫలితంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఫలితంగా ఇప్పటికే కోర్టు సమాధానం ఇచ్చిన వాటికి దాదాపు సమానమైన ప్రశ్నలను సంధి స్తున్న రాష్ట్రపతి న్యాయ సలహాకు కేంద్రం మద్దతు ఇచ్చింది.
ప్రజా ప్రాముఖ్యం కలిగిన చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను, అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తుంది. కోర్టుకు మాత్రం అటువంటి న్యాయ సలహాకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 1964లో ప్రత్యేక సూచన నం.1లోనూ, అయోధ్య వివాదంపై 1993లో ప్రత్యేక సూచన నం.1లోనూ మనం చూసినట్లుగా, న్యాయ సలహాను ఇవ్వకుండా తిరస్కరించే విచక్షణ న్యాయస్థానానికి ఉంది.
కావేరీ జల వివాదాల కేసులో (1998లో ప్రత్యేక సూచననం.1), కోర్టు అప్పటికే ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి లేదారెండవ అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించ లేరని స్పష్టంగా పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం, అలాంటి అప్పీల్ అధికార పరిధి ఈ కోర్టుకు ఉండదు; ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కూడా దానిపై సమీక్ష కోరలేరు... అటువంటి అధికారం ఆర్టికల్ 143లో ఉందనుకుంటే, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర తలోకి తీవ్ర మైన చొరబాటు అవుతుంది’ అని నాడు కోర్టు నొక్కి చెప్పింది.
పునఃపరిశీలన కోరుతున్నట్లయితే...
రాష్ట్రపతి తాజాగా వేసిన 14 ప్రశ్నలు తమిళనాడు తీర్పులో ఇప్పటికే పరిష్కరించబడిన అనేక ప్రశ్నలను ప్రతిధ్వనిస్తాయి. గవర్నర్ ఒక బిల్లును అనేకసార్లు వెనక్కి ఇవ్వవచ్చా, లేదా ఆమోదం కోసం రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి కట్టుబడి ఉండాలా అనేవి వీటిలో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు అస్పష్టంగా వదిలివేయలేదు. అత్యంత స్పష్టతతో నిర్ణయం చెప్పేసింది. అందుకే రాష్ట్రపతి తాజా న్యాయ సలహా నివేదన నిజంగా స్పష్టతను కోరడం లేదనీ, పునఃపరి శీలన కోరుతోందనీ సూచిస్తుంది. అలా అయితే, ఇది చట్టపరమైన సమస్య కాదు. న్యాయవ్యవస్థ అంతిమం అనే పునాదినే ప్రశ్నిస్తోంది.
2012లో 2జీ స్పెక్ట్రమ్‌పై న్యాయసలహా దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ సుప్రీంకోర్టు మునుపటి తీర్పులోని అంశా లను స్పష్టం చేయడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించింది. కోర్టు 122 టెలికామ్ లైసెన్సులను రద్దు చేసిన తర్వాత, సహజ వనరులను కేటాయించడానికి వేలం మాత్రమే అనుమతించదగిన పద్ధతా అనే దానిపై నాటి కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరింది.
వేలం న్యాయమైన పద్ధతి అయినప్పటికీ, అది మాత్రమే రాజ్యాంగబద్ధమైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ప్రధానమైన తీర్పును భంగపరచలేదు. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. 2జీ విషయంలో, తన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం అడగలేదు. కేవలం భవి ష్యత్ విధానంపై తనకు మార్గనిర్దేశం చేయాలని కోరింది.
దీనికి విరుద్ధంగా, తాజాగా రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా అనేది తమిళనాడు కేసు తీర్పులోని ప్రధాన విషయానికి వెళుతుంది. ఇది పరిణామాల వివరణ, లేదా భవిష్యత్ కేసులకు మార్గ దర్శకత్వం కోరదు. బదులుగా, కోర్టు ఇప్పటికే సమాధానం ఇచ్చిన ప్రశ్నలను తిరిగి లేవనెత్తుతుంది. దీన్ని అనుమతించడం అంటే సమీక్షను నియంత్రించే ఆర్టికల్ 137ను కార్యనిర్వాహక వర్గం దాటవేయవచ్చు. ఆర్టికల్ 143 ద్వారా కేసులను తిరిగి వ్యాజ్యం చేయవచ్చు. అది రాజ్యాంగపరంగా అనుమతించరానిది, అలాగే వ్యవస్థాగతంగా ప్రమాదకరమైనది.
రాష్ట్రపతి కార్యాలయ గౌరవం నిలుపుతూనే...
కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు! ప్రత్యేక కోర్టుల బిల్లు కేసులో, కోర్టు ఒక సూచనకు సమాధానం ఇవ్వ డానికి నిరాకరించవచ్చనీ, కాకపోతే అలా చేయడానికి కారణా లను పేర్కొనాలనీ న్యాయస్థానం మాట. 2జీ కేసులో, న్యాయ సలహాను తిరస్కరించడానికి కోర్టు అనేక కారణాలను పొందు పర్చింది: (1) ప్రశ్నలను ఇప్పటికే పరిష్కరించి ఉంటే; (2) ప్రశ్నలు రాజకీయమైనవి అయితే; (3) అవి రాజ్యాంగ ప్రయోజనానికి ఉపయోగపడకపోతే; (4) అవి చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన సమస్యలను కలిగి ఉండకపోతే!
తమిళనాడు తీర్పు స్పష్టంగా పరిష్కరించబడిన రాజ్యాంగ ప్రశ్నా విభాగంలోకి వస్తుంది. దీన్ని తిరిగి తెరవడం వల్ల న్యాయ నిర్ణయాల అంతిమత్వంపై సుప్రీం కోర్టుకు కాకుండా కార్య నిర్వాహక వర్గానికి ప్రాధాన్యతను కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ రాజకీయ నేపథ్యాన్ని విస్మరించలేము. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు చట్టాలకు మోకాలడ్డేందుకు కాలయాపన వ్యూహాలను అనుసరించారు.
ఇది రాజ్యాంగ ప్రశ్న కంటే ఎక్కువగా – రాజకీయంగా అడ్డుకొనే చర్య. ముఖ్యంగా రాజ్యాంగ సమీక్ష మార్గం ఎల్లప్పుడూ అందు బాటులో ఉన్నప్పుడు... రాష్ట్రపతి న్యాయ సలహాను సుప్రీంకోర్టు అంగీకరిస్తే, అది రాజకీయ ఒత్తిడికి లొంగి పోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది. అయితే, కోర్టుకు ఇది క్లిష్టమైనదే. రాష్ట్రపతి కార్యాలయం పట్ల గౌరవాన్నీ, తన నిర్ణయాల సమగ్రతనూ కాపాడు కునే బాధ్యతను సమతుల్యం చేసుకోవాలి.
ఈ న్యాయ సలహాను కోరడం నిజంగా తమిళనాడు కేసును తిరగదోడే ప్రయత్నమే అయితే, కోర్టు దానికి సమాధానం ఇవ్వడా నికి నిరాకరించాలి. న్యాయపరమైన తీర్పుల అంతిమత్వాన్ని తప్పించుకోవడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించలేమని స్పష్టంగా పేర్కొ నాలి. అయితే, భవిష్యత్ పాలన కోసం స్పష్టత అవసరమయ్యేఅంశాలు తీర్పులో ఉంటే, కోర్టు సమాధానం ఇవ్వడానికి ఎంచు కోవచ్చు. కానీ అది తన మునుపటి నిర్ణయానికి చెందిన అధికారాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి.
ఆర్టికల్ 143 రాజకీయంగా తప్పించుకునే మార్గంగా కాకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఒక సాధనంగా ఉద్దేశించబడింది. రాష్ట్రపతి కోరిన ఈ న్యాయ సలహాను పరిశీలన లేకుండా స్వీకరిస్తే, అది కోర్టు అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. కోర్టు రాజ్యాంగ వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా, దాని సంరక్షకురాలిగా కూడా వ్యవహరించాలి. సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం అనేది రెండింటినీ కాపాడుకోవడానికి స్పష్టమైన మార్గం కావచ్చు.
-వ్యాసకర్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
-సంజయ్ హెగ్డే