అజిత్‌ దోవల్‌కు ప్రమోషన్‌ యుద్ధానికేనా? | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 5:01 PM

Why Ajit doval Gets promotion as Strategic Policy group Head - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘హెన్రీ కిస్సింజర్, జేమ్స్‌ బాండ్‌ 007ను కలిపితే జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్‌ దోవల్‌ అవుతారు’ అని ఆయన గురించి ‘కారవాన్‌ మాగజైన్‌’ గొప్పగా రాసింది.  దేశానికి సంబంధించిన  కీలకమైన సమస్యలను కూడా అత్యంత సూక్ష్మ దృష్టితో ఆయన పరిష్కరిస్తున్నారని ఆయన్ని పొగిడింది. ‘మోదీని దోవ్‌ ఎలా రక్షించారంటే’ అనే శీర్షిక పెట్టి మరీ ప్రశంసించింది. ఆయన గత నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగిన మాట వాస్తవమేగానీ ఆయన సాధించిన విజయాలేమిటో ! తెలియదు.

జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాల్లో, విదేశాంగ విధానాల వ్యూహ రచనలో ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు సహాయకారిగా ఉంటారు. కశ్మీర్‌లో మిలిటెంట్‌ సమస్యను నిర్మూలించాలంటే ఎదురుదాడి వైఖరి అవలంభించడం ఒక్కటే మార్గమని సలహా ఇచ్చిందీ అజిత్‌ దోవల్‌. ఈ విషయాన్ని ఆయన కూడా గర్వంగా చెప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకంటే ఇప్పుడు కశ్మీర్‌లో మిలిటెన్సీ సమస్య ఎక్కువగా పెరిగింది. మిలిటెంట్లు, మిలటరీ మధ్య ప్రతిరోజూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇరువురు మధ్య స్థానిక ప్రజలు నలిగి పోతున్నారు. పాకిస్థాన్‌తోని సంబంధాలు మెరుగు పడకపోగా, మరింత దిగజారాయి. అమెరికాతోని, చైనాతోని సంబంధాలు మాత్రం కాస్త మెరుగయ్యాయి. రష్యా నుంచి క్షిపణలను కొనుగోలు చేయడం కొత్త విషయం కాదు. ఇరుదేశాల మధ్య ఈ కొనుగోళ్లు ఎప్పటినుంచో జరుగుతున్నవే. రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తే ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలు పట్టించుకోకపోవడం ఒక్కటే ఇక్కడ మోదీగానీ, దోవల్‌గానీ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్‌కు రహస్య మిత్రుడేనాయే! ట్రంప్‌ విజయంలో పుతిన్‌ పాత్ర ఉన్న విషయం అందరికి తెల్సిందే.

కారవాన్‌ మాగజైన్‌ అంతగా పొగిడినందుకో, తన విదేశీ టూర్లకు వ్యూహరచన చేసినందుకో ఏమోగానీ అజిత్‌ దోవల్‌ను మరింత అత్యున్నత పదవితో సత్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతా సలహాదారు కూడా స్వయంగా వచ్చి సలాం కొట్టాల్సిన ‘వ్యూహాత్మక విధాన కమిటీ’ అధిపతిగా దోవల్‌ను నియమిస్తున్నారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారుతోపాటు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, త్రివిధ దళాధిపతులు సభ్యులుగా ఉంటారు. త్రివిధ దళాధిపతులను ఆదేశించే సంపూర్ణ అధికారాలను కమిటీ అధిపతిగా దోవల్‌కు కల్పిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య లేదా ప్రభుత్వ ఉన్నతాధికారాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం కోసం ఇలాంటి కమిటీ ఉందంటే అర్థం ఉంది.
 
ఇంతకాలం భారత్‌కు అవసరంరాని త్రివిధ దళాధిపతులను ఆదేశించే అధికారాలు కలిగిన కమిటీ ఇప్పుడు ఎందుకు అవసరం అయింది? అందులోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ అవసరం ఎందుకు వచ్చింది? ‘అఫెన్సే బెస్ట్‌ డిఫెన్స్‌’ అని నమ్మే దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం అంటే ఏ దేశంపై యుద్ధానికి సన్నాహాలు అనుకోవాలి? కాలమే సమాధానం చెబుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement