మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్‌’లు తక్కువ!

Who Will Higher Risk Of Strokes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు.

మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు గురయ్యారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్‌ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్‌ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’ సీనియర్‌ డైటిస్ట్‌ ట్రేసి పార్కర్‌ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఇదీ శాకాహార చరిత్ర)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top