బంగారు ఆభరణాలు మింగిన యువతి

West Bengal Ornaments Coins Removed From Womans Stomch - Sakshi

కోల్‌కతా : ఇంత వరకూ ఇనుప వస్తువులు మింగిన వారి గురించే చదివాం. కానీ ఈ యువతి ఏకంగా బంగారాన్ని మింగేసింది. ఇలా ఇప్పటి వరకూ ఆమె కడుపులో దాదాపు కిలోన్నరకు పైగా బంగారం చేరింది. ఆ వివరాలు... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి మతి స్థిమితం లేదు. దాంతో ఆకలేసినప్పుడల్లా చేతికి దొరికిన పదార్థాలను తినేది. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలను కూడా కడుపులో పడేసుకుంది. దాంతో గత కొద్ది రోజులుగా యువతి అనారోగ్యంతో బాధపడుతుంది. తిన్న వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆపరేషన్‌ చేయగా ఆమె కడుపులో ఆభరణాలు, నాణాలు కనిపించాయి.

ఆపరేషన్‌ చేసిన వైద్యుడు... యువతి కడుపులో నుంచి గొలుసులు, ముక్కు పుడకలు, చెవి పోగులు, గాజులు, బ్రాస్‌లెట్ తదితర ఆభరణాలతోపాటు రూ.5, రూ.10 నాణేలను వెలికితీశామని తెలిపాడు. వీటి బరువు సుమారు 1.5 కిలోగ్రాముల వరకూ ఉందన్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే కోలుకుంటుందని తెలిపారు. ఈ విషయం గురించి బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురికి మతిస్థిమితం లేదు. ఎప్పుడూ ఆమెను ఇంట్లో ఎవరో ఒకరు కనిపెట్టుకునే ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఆభరణాలను మింగి ఉంటుంది. ఇన్ని రోజులుగా ఇంట్లో ఆభరణాలు కనిపించకుండా పోతుంటే మాకు అర్థం కాలేదు. ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అని అనుమానం కలిగింది. దీని గురించి మా అమ్మాయిని అడిగితే ఏడ్చేదే తప్ప.. ఏం చెప్పేది కాదు. అయితే గత కొద్ది రోజులుగా భోజనం చేసిన వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఆస్పత్రికి తీసుకురావడంతో ఈ విషయం తెలిసింది’ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top