ఢిల్లీని కమ్ముకున్న మంచు

Weather Department Issues Red Warning For Delhi As Cold Wave Persists - Sakshi

119 ఏళ్లలో అత్యంత చలిదినం

ఆలస్యంగా 530 విమానాలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో డిసెంబరులో సోమవారం(30న)ను అత్యంత చలిదినంగా భారతవాతావరణ శాఖ ప్రకటించింది.  ఢిల్లీలో 119 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా డిసెంబర్‌లో 9.4 డిగ్రీ సెల్సియస్‌ల అతి తక్కువ ఉష్ణోగ్రత  నమోదైందని  తెలిపింది. సఫ్దర్‌జంగ్‌లో సోమవారం 9.4 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ట్విట్టర్‌లో వెల్లడించారు. దీని ప్రభావం విమానరాకపోకలపై పడింది. మంచుకారణంగా సోమవారం ఉదయం ఢిల్లీలో 20 విమానాలను దారిమళ్ళించారు. 530 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.∙మంచుకురుస్తుండటంతో రైళ్ళ రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. 30 రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నట్టు నార్తర్న్‌ రైల్వే ప్రకటించింది. మరోవైపు, దట్టమైన పొగమంచు కారణంగా గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలోని ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

అందుకే ఢిల్లీలో చలి పెరిగింది!
ఢిల్లీలో రెండో అత్యంత శీతల డిసెంబర్‌గా 2019 డిసెంబర్‌ నిలిచింది. ఇందుకు కారణాలను వాతావరణ నిపుణులు విశ్లేషించారు. ఢిల్లీకి ఉత్తరంగా ఉన్న కొండప్రాంతాల్లో డిసెంబర్‌ నెలలో భారీగా మంచు కురవడానికి, చలికాలంలో అక్కడ వర్షాలు కురవడానికి కారణమైన పశ్చిమ తుపాను గాలులు(వెస్ట్రన్‌ డిస్ట్రబెన్సెస్‌) గత 10 రోజులుగా వీయకపోవడం అందుకు కారణమని పేర్కొన్నారు. ఆ గాలులు ఢిల్లీ వైపు వీచే అతి శీతల గాలుల దిశను మారుస్తాయని, అవి రాకపోవడం వల్ల ఢిల్లీలో చలి తీవ్రస్థాయికి చేరిందని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ సమాచార కేంద్ర డైరెక్టర్‌ కుల్దీప్‌ శ్రీవాస్తవ వివరించారు.

ఉత్తరాది పీఠభూమి ప్రాంతంపై.. పంజాబ్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌ వరకు 2 వేల నుంచి 3 వేల అడుగుల ఎత్తులో దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరలేకపోతున్నాయని, ఈ డిసెంబర్‌ చలికి అది కూడా కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌లో పనిచేస్తున్న నిపుణుడు మహేశ్‌ పాలవత్‌ పేర్కొన్నారు. ఈ సంవత్సరం యూపీ నుంచి ఢిల్లీ వైపు వీస్తున్న తూర్పు గాలులు కూడా అత్యంత శీతలంగా ఉన్నాయన్నారు. ఈ తూర్పుగాలుల్లోని తేమ కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడుతోందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top