సోనియాతో కాకా తనయుల భేటీ | Vivek, Vinod meet Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాతో కాకా తనయుల భేటీ

Mar 31 2014 12:17 PM | Updated on Oct 22 2018 9:16 PM

కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరే విషయంపై సోనియా, వివేక్ బ్రదర్స్ మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. సోనియా వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వనించారని, ఇదే రోజు వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. కాసేపట్లో కాకా తనయులు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశముంది.

వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో  సుమారు గంట పాటు చర్చలు జరిపారు.
 
ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్‌కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం.

ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి  గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement