ఆ ఊళ్లో ఉల్లి ధర ఎంతైనా ఓకే..

This Village In Bihar Wouldnt Care Over Onions Cost - Sakshi

పట్నా : ఉల్లిగడ్డ ధర వందకు చేరువై గృహిణులకు కన్నీరు తెప్పిస్తుంటే ఆ ఊర్లో మాత్రం ఉల్లి ధర ఎంతైనా మాకు బాధలేదు అంటున్నారు. అసలు ఉల్లి ధర ఎంతో కూడా తమకు తెలియదని చెబుతున్నారు. బిహార్‌లోని జెహనాబాద్‌ జిల్లా త్రిలోకి బిఘా గ్రామ ప్రజలకు ఉల్లి వాసనే పడదు. రాష్ట్ర రాజధాని పట్నాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో దాదాపు 350 మంది జనాభా. ఈ గ్రామంలోని 30 కుటుంబాల్లో ఏ ఒక్కరూ ఉల్లిగడ్డ ముట్టరు. గ్రామంలో ఎవరూ ఉల్లి తినకపోవడంతో ధర ఎంతైనా తమకు బాధ లేదని వారు చెబుతున్నారు. తమ గ్రామంలో అందరూ శాకాహారులేనని, ఉల్లితో పాటు అల్లం కూడా తినమని ఎవరూ మద్యం ముట్టరని గ్రామస్తులు చెప్పుకొచ్చారు.

శతాబ్ధాల నుంచి తమ గ్రామంలో ఇదే పద్ధతి పాటిస్తున్నామని గ్రామ పెద్దలు చెప్పడం గమనార్హం. తమ గ్రామంలో విష్ణు దేవాలయం ఉన్నందున శతాబ్ధాలుగా ఉల్లి తినడం నిలిపివేశామని, ఇప్పటికీ తమ పెద్దలు పాటించిన పద్ధతిని కొనసాగిస్తున్నామని గ్రామ పెద్ద రాంపర్వేష్‌ యాదవ్‌ అన్నారు. తనకు కనీసం ఉల్లి ధర ఎంతో కూడా తెలియదని చెప్పారు. గతంలో ఉల్లిగడ్డను తిన్నకొందరు గ్రామస్తులు ప్రమాదాల్లో మృత్యువాతన పడటంతో ఇక ఎన్నడూ ఉల్లి జోలికి పోకూడాదని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పద్ధతికి గ్రామస్తులు కట్టుబడిఉన్నారని, గ్రామం విడిచి వెళ్లిన సందర్భాల్లో ఉల్లి, అల్లం వాడకుండా తయారుచేసిన ఆహార పదార్ధాలు వండిన చోటే గ్రామస్తులు తినేవారని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top