కాంగ్రెస్‌లో విజయశాంతి | vijayashanthi joins in congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో విజయశాంతి

Feb 28 2014 12:09 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌లో విజయశాంతి - Sakshi

కాంగ్రెస్‌లో విజయశాంతి

మెదక్ ఎంపీ, టీఆర్‌ఎస్ బహిష్కృత నేత విజయశాంతి గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సోనియా
 నాయకుడంటే మాటపై నిలబడాలంటూ
 కేసీఆర్‌పై విజయశాంతి విమర్శ

 
 సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ ఎంపీ, టీఆర్‌ఎస్ బహిష్కృత నేత విజయశాంతి గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియా ఆమెకు పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉంటున్న విజయశాంతి అధికారికంగా ఆ పార్టీలో చేరినట్లయింది. ఈ సమయంలో పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా ఉన్నారు. అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘విజయశాంతి తెలంగాణ కోసం చాలా ఏళ్లుగా కృషిచేశారు. ఈ రోజు మా పార్టీలో చేరారు..’’ అని ప్రకటించారు. తరువాత విజయశాంతి మాట్లాడారు. నాయకుడంటే ఇచ్చిన మాటపై నిలబడాలంటూ పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించారు. ‘‘60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరింది.
 
  తెలంగాణ ఇవ్వండి కాంగ్రెస్ పక్షాన ఉంటానని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి.. ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నా మాట నిలబెట్టుకుంటున్నాను.. మీ పార్టీలో చేరుతున్నా.. అని సోనియాగాంధీకి చెప్పాను. ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాను. ఎవరైనా సరే.. మాట ఇస్తే దానికి కట్టుబడాలి. అప్పుడే ప్రజలకు వారి మీద నమ్మకం ఏర్పడుతుంది. కానీ, చాలా మంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. అది సరికాదు.
 
  తెలంగాణ కోసం మనమందరం చివరి వరకు నిలబడ్డాం. ఇవాళ శివరాత్రి. నేను శివభక్తురాలిని కూడా. ఈ రోజు కాంగ్రెస్‌లో చేరడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజల తరఫు నుంచి కాంగ్రెస్‌కు, సోనియా, మన్మోహన్, పార్టీలోని ఇతర ముఖ్యులకు నా కృతజ్ఞతలు..’’ అని విజయశాంతి పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? అని ప్రశ్నించగా... ‘‘దేనికి పోటీ చేస్తానన్నది కాదు.. పార్టీని బలోపేతం చేయడమే నాకు ముఖ్యం. నా పోటీని పార్టీ నిర్ణయిస్తుంది..’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో విలీనానికి టీఆర్‌ఎస్ ఇష్టపడడం లేదని ప్రస్తావించగా... ‘‘నేను అదే అంటున్నా.. గతంలో ఏం చెప్పాం.. ఎవరమైనా దానిపై నిలబడాలి. నేను 16 ఏళ్లుగా తెలంగాణ కోసం నిలబడ్డాను.
 
  కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీవైపు ఉన్నాను. పదవులు, గెలుపోటములు తర్వాతి విషయం. ముందు నాయకుడికి మంచి లక్షణాలు ఉండాలి. ఒక విజన్ ఉండాలి. నిజాయతీగా ఉండాలి. ప్రజల వద్దకు వెళ్లే మనుషులై ఉండాలి. వెనకబడిన ప్రాంతాలు కాబట్టి ముందు ప్రజల గురించి ఆలోచించేవాళ్లు కావాలి... అంతేగానీ, పదవుల గురించి ఆలోచించే వాళ్లు కాదు..’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement