ఎవరెస్ట్‌పై కాస్ట్‌లీ డిన్నర్‌ !

Very Costly Dinner At Mount Everest - Sakshi

ఆ విందు తినాలంటే మీరు భోజన ప్రియులైతే మాత్రమే సరిపోదు. గుండెల్లో కాస్త ధైర్యం ఉండాలి. శారీరక పుష్టి, ఆర్థిక పరిపుష్టి కూడా మీ సొంతమై ఉండాలి.. అప్పుడే ఆ డిన్నర్‌ ఎంజాయ్‌ చేయగలరు. ఎందుకంటే అదేమీ అల్లాటప్పా భోజనం కాదు. సముద్ర మట్టానికి ఏకంగా 11,600 అడుగుల ఎత్తులో వండి వార్చబోతున్నారు. ఎవరెస్ట్‌పై ఒక అరుదైన ప్రపంచ రికార్డు కోసం కొంత మంది చెఫ్‌లు భారీగా కసరత్తు చేస్తున్నారు. నేపాల్‌ బేస్‌ క్యాంప్‌లో ఓ  రెస్టారెంట్‌ గిన్నీస్‌ రికార్డులకెక్కడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వెనుక మొత్తం నలుగురు చెఫ్‌లు ఉన్నారు. 

ట్రియాంగ్యోని పేరుతో ఎవరెస్ట్‌పై డిన్నర్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. అంత ఎత్తులో అసలు ఆక్సిజన్‌ అందక ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది, అలాంటిది భోజనం చేయడం అంటే మాటలా ? అందుకే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మెనూ రూపొందిస్తున్నారు. ఈ మెనూలో మసాలా పదార్థాలకే పెద్ద పీట వేస్తామని రెస్టారెంట్‌లో భాగస్వామి అయిన మన ఇండియన్‌ చెఫ్‌ సంజయ్‌ థాకూర్‌ వెల్లడించారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకుంటూ ఈ నెలఖారు నుంచి రోజుకి ఆరుగంటల సేపు ట్రెక్కింగ్‌ చేస్తూ నలుగురు చెఫ్‌లు, పదిమంది అతిథులు ఎవరెస్ట్‌కు చేరుకోనున్నారు. అతిథులెవరైనా ట్రెక్కింగ్‌ చేయలేకపోతే వారంతా హెలికాప్టర్లలో ఎవరెస్ట్‌కు చేరుకునే సదుపాయం కూడా ఉంది. ఎవరెస్ట్‌పై డిన్నర్‌ తినాలనుకునే ప్రతి ఒక్కరూ 3 లక్షల 64 వేల రూపాయలు చెల్లించాలి. కేవలం భోజనం మాత్రమే కాదు, ప్రయాణానికయ్యే ఖర్చు, వసతి అన్నింటికి కలిపి ఆ మొత్తాన్ని తీసుకుంటున్నారు. 

ఎవరెస్ట్‌ లాంటి ప్రాంతానికి వెళ్లాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు మరి. అలా వచ్చిన మొత్తాన్ని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే హార్ట్‌ ఫర్‌ ఇండియా ఫౌండేషన్‌కు ఇవ్వనున్నారు. అన్నట్టు ఇలా ఎవరెస్ట్‌పై డిన్నర్‌ ఐడియా ఇది మొదటిసారి కాదు. 2016లో ప్రఖ్యాత చెఫ్‌ జేమ్స్‌ షెర్మన్‌ ఇలా రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కానీ అది వరల్డ్‌ రికార్డులకు ఎక్కలేదు. ఈసారి ఎలాగైనా ప్రపంచ రికార్డులకెక్కాలని చెఫ్‌లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎవరెస్ట్‌పై భోజనం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా ఫైన్‌డైనింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top