కలుషిత ఆహారంతో 20 మందికి అస్వస్థత

Twenty People Fall Ill Due To Food Poisoning - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కలుషిత ఆహారం తీసుకోవడంతో న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 20 మంది అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించేందుకు బొకారో స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. నాణ్యత లేని ఆహారం విక్రయించడంపై ప్రయాణీకులు బొకారో రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. సీనియర్‌ రైల్వే అధికారులు స్టేషన్‌కు చేరుకుని ప్రయాణీకులకు నచ్చచెప్పి వారికి వైద్య చికిత్స ఏర్పాట్లు చేశారు.

కాగా, అనారోగ్యానికి గురైన వారిలో చిన్నారులూ ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి శనివారం సాయంత్రం బయలుదేరిన రైలులో రాత్రి సమయంలో ప్రయాణీకులకు ఇచ్చిన ఆహారం తిన్న వెంటనే పలువురు అసౌకర్యానికి గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు అధికారులకు తెలిపారు. కొందరి ప్రయాణీకుల పరిస్థితి మరింత విషమించడంతో బొకారో రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. గంటపాటు ప్రయాణీకులకు చికిత్స అందించిన అనంతరం రైలు తిరిగి బయలుదేరిందని, ఘటనపై విచారణకు ఆదేశించామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top