'21 రోజుల్లో కరోనాపై విజయం సాధించాలి' | Treat doctors with respect Says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

వైద్యులు తెల్లకోటు దేవుళ్లు

Mar 26 2020 1:39 AM | Updated on Mar 26 2020 8:10 AM

Treat doctors with respect Says PM Narendra Modi - Sakshi

కేబినెట్‌ భేటీలో సామాజికదూరం పాటిస్తూ కూర్చున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో అగ్రభాగంలో ఉన్న వైద్యులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు శ్రమిస్తున్న యంత్రాంగానికి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకుతుందనే భయంతో కొన్నిచోట్ల ఎయిర్‌లైన్స్, వైద్య సిబ్బందిని ప్రజలు వివక్షకు గురి చేయటంపై ఆయన స్పందించారు. భారత యుద్ధం 18 రోజులే సాగిందని, కరోనాపై మన సంగ్రామం మాత్రం 21 రోజులు కొనసాగుతుందని చెప్పారు. పార్లమెంట్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించిన ప్రధాని ఇబ్బందులు ఉండటం నిజమేనని, అంతా బాగుందని చెప్పడమంటే ఆత్మ వంచనే అవుతుందని వ్యాఖ్యానించారు. వైద్యులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పట్ల కొందరు అమర్యాదగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన వార్తలు తనకు బాధ కలిగించాయన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ, డీజీపీలను ఆదేశించినట్లు చెప్పారు. విపత్కర సమయంలో సేవలందిస్తున్న వైద్యులు, నర్సులను లక్ష్యంగా చేసుకునే వారిని ఉపేక్షించబోమన్నారు. తెల్ల కోటు ధరించే వైద్యులు, నర్సులు దేవతల లాంటి వారని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి వారిపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించేవారిని ప్రజలు కూడా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  
 

ఈ యుద్ధంలో ప్రజలే సారథులు..
‘కొన్ని చోట్ల సరైన సదుపాయాలు లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల స్వల్ప సంఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ వీటిపైనే దృష్టి పెట్టి ప్రచారం చేయడం, కొన్ని రంగాలను నిరుత్సాహపరచడం ఈ సమయంలో మంచిది కాదు. నిరాశావాదాన్ని వ్యాప్తి చేసేందుకు వెయ్యి కారణాలు ఉండొచ్చు. వారంతా తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేదు. కానీ ఆశావాదం, విశ్వాసంపైనే జీవితం కొనసాగుతుంది’అని ప్రధాని వ్యాఖ్యానించారు. కఠిన పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులు, పోలీస్‌ సిబ్బంది, ఇతరులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలు, పుకార్లు, స్వీయ వైద్యాన్ని విడనాడాలని సూచించారు. భయంకరమైన ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే సామాజిక దూరాన్ని పాటించడమే మార్గమని ప్రధాని స్పష్టం చేశారు. ‘చారిత్రక మహాభారత యుద్ధాన్ని 18 రోజుల్లో గెలిచారు. కరోనాపై 21 రోజుల్లో విజయం సాధించాలని మనం సంకల్పించాం’అని చెప్పారు. నాడు శ్రీకృష్ణుడు రథ సారథిగా ఉన్నారని, ఇప్పుడు ఈ యుద్ధంలో 130 కోట్ల మంది ప్రజలూ సారథులేనని ప్రధాని పేర్కొన్నారు.  

నేడు జీ–20 దేశాల సదస్సు
వైరస్‌ కట్టడిపై చర్చించేందుకు గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న జీ–20 దేశాల సదస్సు కోసం ఎదురు చూస్తున్నట్లు మోదీ తెలిపారు. కోవిడ్‌ అరికట్టడంలో జీ–20 దేశాలు అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు.  

వాట్సాప్‌తో హెల్ప్‌డెస్క్‌
నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా అందరూ తొమ్మిది పేద కుటుంబాల సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని మోదీ కోరారు. వైరస్‌ను ఓడించడంలో కరుణ చూపడం ఓ భాగమేనన్నారు. ‘ఇబ్బందులు 21 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ కరోనా సంక్షోభం ముగియలేదు. వైరస్‌ వ్యాప్తి ఆగలేదు. అది కలగజేసే నష్టాన్ని ఊహించలేం’అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికిపైగా కోవిడ్‌–19 బాధితులు కోలుకున్నారని తెలిపారు. ‘ఈ మహమ్మారికి పేద, ధనిక, కులమతాలు, ప్రాంతాలనే తేడా లేదు. ఆరోగ్యంపై ఎంతో జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం సోకుతోంది. సామాజిక దూరం పాటించడమే దీనికి విరుగుడు. ప్రజలు ఓర్పు వహించి మార్గదర్శకాలను అనుసరించాలి. వాట్సాప్‌తో కలసి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 90131 51515 నంబర్‌లో సంప్రదించడం ద్వారా మార్గదర్శకాలను తెలుసుకోవచ్చు’అని ప్రధాని పేర్కొన్నారు. కాశీ నగరం ఓర్పు, సమన్వయం, శాంతి, సహనం, సేవాభావంతో దేశానికి దారి చూపుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement