భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు ఇదే..

This Train Becomes  Fastest Train In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో తొలి ఇంజన్‌ రహిత సెమీ హైస్పీడ్‌ రైలు ట్రైన్‌-18 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. ట్రయల్‌ రన్‌లో ఈ మేరకు ట్రైన్‌ 18 విజయవంతంగా ఈ వేగాన్ని అందుకుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ నిర్ధారిస్తూ ట్వీట్‌ చేశారు. ట్రైన్‌ 18 అధికారికంగా భారత్‌లోనే అత్యంత వేగవంతమైన రైలుగా నమోదైందని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29న తన నియోజకవర్గం వారణాసిలో ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈ రైలు ఢిల్లీ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. ఇక వారణాసి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు దేశ రాజధానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల తరహాలో ఈ రైలులో ఫ్లెక్సీ ఫేర్‌ విధానం ఉండదు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ప్రయాణ చార్జీలు 20 నుంచి 25 శాతం అధికంగా ఉంటాయి. ఇక భోజనంతో పాటు, భోజనం లేకుండా చార్జీలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

వేగంతో పాటు అత్యాధునిక, విలాసవంతమైన సదుపాయాలను ఈ రైలులో ఏర్పాటు చేశారు. పూర్తి ఏసీలో ఉండే రైలులో 16 చైర్‌కార్‌ తరహా కోచ్‌లుండగా, వీటిలో రెండు ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్స్‌ ఉంటాయి. ఆటోమేటిక్‌ డోర్స్‌, ఆన్‌బోర్డ్‌ వైఫై, జీపీఎస్‌ ఆధారిత సమాచార వ్యవస్థ, ఎల్‌ఈడీ లైటింగ్‌ సహా పలు సౌకర్యాలు ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top