ఎగ్జిట్పోల్స్ అంచనా వేసినట్టే పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్, కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: ఎగ్జిట్పోల్స్ అంచనా వేసినట్టే పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్, కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, తొలి నుంచి టీఎంసీ హవా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, టీఎంసీ 211 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష లెఫ్ట్ కూటమి కేవలం 70 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. బీజేపీ 9 చోట్ల ముందంజలో ఉంది. మూడుదశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమతకు ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది.
కేరళలోనూ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ ఎల్డీఎఫ్ కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో నిలిచింది. 140 సీట్లున్న కేరళలో ఎల్డీఎఫ్ 83 స్థానాల్లో, అధికార యూడీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో బీజేపీ తొలిసారి బోణీ చేసే అవకాశముంది. ప్రస్తుతం బీజేపీ ఓ చోట ముందంజలో ఉంది.