
భారత ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్రా అధ్యక్షురాలు....
సాక్షి, చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్రా అధ్యక్షురాలు తమిళ్‌సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆవిష్కరించిన మోదీకి నోబెల్ ఇవ్వాలని.. ఆ మేరకు ఆయన పేరును నోబెల్ కమిటీకి ఆమె నామినెట్ చేశారు. దీనికి దేశ ప్రజలు అందరూ మద్దతు తెలపాలని కోరారు. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం రాంచీలో అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే.
దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ ప్రచారం చేస్తోంది. ఇంత పెద్ద పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలులో లేదని దానికి రూపకల్పన చేసిన మోదీకి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తమిళసై అన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేర్చనున్నారు.