‘సంసారమైనా, వ్యాపారమైనా బలవంతంగా చేయండంటే.. దాన్ని ఏమంటారో మీ భార్యల్నే అడిగి చెప్పండి’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సీమాంధ్ర ఎంపీలపై ధ్వజమెత్తారు.
సీమాంధ్ర ఎంపీలపై టీ-ఎంపీలు పొన్నం, గుత్తా ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సంసారమైనా, వ్యాపారమైనా బలవంతంగా చేయండంటే.. దాన్ని ఏమంటారో మీ భార్యల్నే అడిగి చెప్పండి’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సీమాంధ్ర ఎంపీలపై ధ్వజమెత్తారు. వారు గురువారమిక్కడ ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక సైతం దానిని అడ్డుకుంటామని, విభజన జరగదని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.
పార్టీ నిర్ణయంపై గౌరవం లేకుండా, ధిక్కార ధోరణితో వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం లోక్‌సభలో సైతం ఉండవల్లి ప్రసంగాన్ని తాము అడ్డుకోలేదని, వాస్తవాలు చెప్పమని మాత్రమే అడిగామని అన్నారు. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టుగా సీమాం ధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారి దొంగ నాటకాలను ఇకనైనా కట్టిపెట్టాలని సూచించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం ద్వారా సీఎం విద్వేషాలను మరింత పెంచుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘా తం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారంతా విభజనను సమర్థించాలని వారు సూచించారు.