కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య..

Tej Prataps Wife Aishwarya Leaves Rabri Devis Home - Sakshi

పట్నా : విడాకుల కేసుకు సంబంధించి కోర్టుకు బదులిచ్చిన నెలరోజుల తర్వాత బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోడలు, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ భార్య ఐశ్వర్య రాయ్‌ మెట్టినింటిని వీడారు. తండ్రి చంద్రికారాయ్‌ వాహనంలో ఆమె అత్త రబ్రీ దేవి నివాసం నుంచి కన్నీటితో వెనుదిరిగారు. గత ఏడాది మేలో ఆర్భాటంగా వీరి వివాహం జరగ్గా అప్పటి నుంచి తేజ్‌ ప్రతాప్‌ భార్య ఐశ్వర్య అత్తవారింట్లోనే ఉన్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే వీరి మధ్య కలతలు చెలరేగాయి. తేజ్‌ ప్రతాప్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఐశ్వర్యా రాయ్‌ గత నెలలో ఆరోపించారు. గృహ హింస నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె సెక్షన్‌ 26 కింద ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

వివాహం జరిగిన కొద్దిరోజులకే తన భర్త తేజ్‌ ప్రతాప్‌ డ్రగ్స్‌కు బానిసగా మారాడని గుర్తించానని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన అత్తమామలకు ఈ విషయం తెలిపినా వారు పట్టించుకోలేదని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ తీసుకున్న తర్వాత ఆయన తనను తాను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె పేర్కొన్నారు. ‘తేజ్‌ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్‌ అయ్యాను. ఒకసారి డ్రగ్స్‌ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్‌ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఐశ్వర్య వెల్లడించారు. పెళ్లయిన కొద్ది నెలలకే వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top